పుట:Naayakuraalu.Play.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

నాయకురాలు

నర : ఓహో అలరాజుగారా ! ఎంతకాలానికి చూడడమయింది ! ఇది గొప్పసుదినం. రాజధర్మాన్నిబట్టి, రక్తబంధములు గూడా ఇట్లా దూరంగా వుండవలసివచ్చింది. ఇక్కడికి అదృష్టవంతులమే. అంతా తిన్నగా వచ్చారా? ఇదెట్లా, ఇంతకాలానికి కుశలంగా వచ్చినందుకు నెమ్మదిగా మాట్లాడడానికికూడా అవకాశంలేదు. నౌకరీ వొప్పుకున్నతర్వాత శరీరం అమ్ముకున్నట్టే, స్వాతంత్ర్యంలేదు. రాజుగారి దగ్గరనుంచి నన్ను తక్షణం రమ్మని ఉత్తరువు వచ్చింది. భోజనంగూడ అక్కడనే చేతామని బయలుదేరుతున్నా. ఏదో అగత్యంగా సలహాపదమున పుట్టింది. తమరు కాళ్లు కడుక్కోండి, వంటవుతున్నది. భోజనంచేసి కొంచెం విశ్రమించి బయలుదేరితే ప్రొద్దుగూకేవరకు గురిజాల చేరుతారు.

అ. రా : నేనూ బయలుదేరుతా మీతోటే ; మాట్లాడుతూ పోదాం.

నర : మీరు దూరంనుంచి వస్తున్నారు ; అలిసివుంటారు. తొంద రేమి? నిదానంగ చేరండి.

అ. రా : నేనూ రాజ సేవమీదనే వచ్చా. మిమ్మును తొందరగా పిలిపించడానికి కారణం నా రాకనుగురించి మాట్లాడడానికే అయివుంటుంది. తమరు రాజుగారిని సందర్శించక ముందే మీతో నే వచ్చిన పనిని – సంధికార్యమునుగూర్చి మాట్లాడుదామని వున్నది.

నర : అయితే బయలుదేరండి. ఒక రివర్దీలో వున్నవాండ్లకు వేళకు భోజన మెట్లాసంభవిస్తుంది ?