పుట:Naayakuraalu.Play.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ix

యొడ్డున యుభయపక్షములవారును పోరి అనేకవేలజనులను నాశము చేసికొనిరి. చివఱకు ఆ యుద్ధమున నలగామరాజు పరాజితుడై బ్రహ్మనాయుని శరణు సొచ్చెను. మహావీరుడు, దయాళువు. ఆర్య వర్తనుడు, నిశ్చలమగు ప్రభుభక్తి దేశసేవానిరతి ప్రజానురాగాసక్తి గల బ్రహ్మనాయుడు నలగామరాజును చేపట్టి అతనికి గురిజాల సింహాసనమున తాను పట్టాభిషేకముచేసి, తానే ప్రధానియై పరిపాలనముచేసి కీర్తినొందెను.

వీరులకథ - నాయకు రాలిలో దాని కూర్పు

పల్నాటివీరులకథలో గల సారాంశ మిది. దీనిని నాటకముగా వ్రాయుటలో మన పంతులుగారు నాయకురాలిని ప్రధానపాత్రనుగా తీసికొన్నారు. తీసికొనుటయేమి ? అసలు కథలోగూడ నాయకురాలే ప్రధానురాలు. నాయకురాలివంటి తీవ్రరాజకీయపరిజ్ఞాత్రి ఈ కథలో లేనియెడల బ్రహ్మనాయుని సుగుణములు ప్రకాశదశకే వచ్చి యుండెడివి కావు. అగుటకు ఆడుదియే యైనను ఈమె యుద్ధరంగమున సాక్ష్మానృత్యుదేవతయే ! రాజ్యతంత్రము నడపుటలో చాణక్యునంతటి వానికైన టాఠాలు గుణింపచేయగల కుటిలప్రజ్ఞగల కోమలి. నలగామరాజు మొదలగువారిని తోలుబొమ్మలవలె గారడీచేసి ఆడించిన సాహసురాలు, అపరభీష్ము డనందగిన బ్రహ్మనాయుని యంతవానిని గడగడ వణకించిన అంబాస్వరూపిణి. ఎత్తుకు ప్రతి యెత్తు ఎత్తుటలోనేమి, వ్యూహమునకు ప్రతివ్యూహమును పన్నుటలో నేమి ఈమె కీమెయే సాటి. ముద్రారాక్షసనాటకమునందు రాజసమంత్రి యొక్క పన్నాగములను పాడువారించి, నందవంశమునందుగల భక్తిచే వివిధ ప్రయత్నములుచేసియైనను ప్రభుభక్తిని జూపగా దివిరిన రాక్షసమంత్రిని, చాణక్యు డేవిధముగా లొంగదీసి పరపక్షమునకు దాసుడై మంత్రిపదవిని వహించి, తదభివృద్ధికై పాటుపడజేసెనో, అట్లే మన నాయకురాలును బ్రహ్మనాయుని సర్వప్రయత్నములను ఉపసంహరించి, చివఱకు అతనిచేతనే నలగామరాజునకు మంత్రిత్వము చేయించిన (చేయునట్లుచేసిన) జాణ. నాయకురాలియందు ఇంతటి