పుట:Naayakuraalu.Play.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

నాయకురాలు

కొమ్మ : ఇందులో ఆశ్రయింపేమున్నది? అయినా ధర్మరాజు మార్గాన్నే మన మవలంబిస్తున్నాము.

అనపోతు : మొదటినుంచీ వాండ్లసంగతి తెలిసికూడా పొరబడుతున్నారు. రాయబారానికి సాధారణంగా నాయకుణ్ణి పంపుతాముకదా!

కొమ్మ : వోడంటే కంచమంతా వో డనగూడదు. ఉభయులమూ పరాయివాండ్లంగాదు. బంధువర్గముతో యుద్ధమంటే వచ్చే సాధక బాధకాలు మీకు దెలియవు. ఇది ఉద్రేకంతో తీరుమానించవలసిన విషయం గాదు.

బ్రహ్మ : సామోపాయంవల్ల చక్కబడేపనికి దండోపాయం ప్రయోగించగూడదు.

బా. చం : మాచర్లమండలంలో యిప్పటివరకు విశేషంగా సేనలు లేవు. మనము ముందు పోయి ఆక్రమించుకొంటే తరువాత మనను వెళ్లగొట్టడం కష్టం.

బ్రహ్మ : ముం దాక్రమించుకొనడంవల్ల తాత్కాలికలాభ మున్నట్టు కనబడ్డా, మాచర్లకు కోటగోడలు లేకపోవడం చేత వారి సేనలు వచ్చినతరువాత ఆమోద ముండదు. అదిగాక మనం మాచర్ల బలవంతంగా ఆక్రమించుకోబోతే జనులు యెదిరిస్తారేమో చెప్పలేము. తొందరపడితే లాభం లేదని తోస్తుంది.

కొమ్మ : ఒడంబడికప్రకారం మనకు రావలన భాగం సౌమ్యంగా అడిగినప్పుడు వారు కాదంటే లోకానికి విడ్డూరంగా తోస్తుంది. జనము మనకు తోడ్పడకపోయినా ఎటూ చేరకుండా తటస్థులుగానయినా వుంటారు.