పుట:Naayakuraalu.Play.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5-వ అంకము

[ప్రతాపుడు ప్రవేశము ]

ప్ర: మానవుడు నాకూ, నాసోదరికీ ఆశాభంగమే కలిగించాడు. వాడి కింకా శృంగారమంటే అర్థంగాలేదని నా సోదరంటుంది. ప్రతాపమంటే అర్థంగాలేదని నాకుతెలుసు. క్రౌర్యంలేని ప్రతావమే వాడికి లేదు. కొమ్ములు, కోరలు, కొండీలు, గోళ్లు, గిట్టలు మొదలయిన మారణసాధనాలు లేకుండా వాడిని సృష్టించి సత్యవీరుణ్ణిగా చేతామని మా ఆశయం. "తలలు బోడులైతే తలపులు బోడులా ? అన్నట్లు బాహ్యంగా మారణసాధనాలు లేవన్నమాటేగాని వాడి తలంపులన్నీ మారణసాధనాలే. జంతువులకు స్వాభావికముగావున్న మారణసాధనాలకంటె వేయిరెట్లు, క్రూర మయిన సాధనాలు స్వబుద్ధిచేత కల్పించుకొన్నాడు. పశుత్వంలోనుంచి మానవత్వమనే మెట్టుకూడా యెక్కలేదు. క్రమంగా యెక్కు తా డనుకొంటాను. మానవత్వం వదలి దేవత్వం వచ్చేవరకు చాలాకాలము పట్టుతుంది. అంతవరకూ మామూలుమార్గాన్నే పోతూవుంటాడు.

[ నిష్క్రమణం ]