పుట:Naayakuraalu.Play.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

99

క. దా: తరువాత నోదేవా ! చెంచుల తండములు కొన్ని గోవులను, మరికొన్ని గోపాలురను ముట్టడించినవి. గోవులు దూడలను నడుమ బెట్టుకొని మూడువల్లెములుదీరి మొగ్గరించి నిలచినవి. చెంచులు కఱ్ఱలు, కత్తులు దీసికొని ఆవులపై బడగా వాటిలో ముందలివరుస ముట్టెలు వోరవొంపుగా బెట్టి, తోకమట్ట లెగబట్టి, బుసకొట్టుతూ ముందుకు చెంగలించి దుమికి చోరులను కొమ్ములతో చీరీ, డొక్కలలో గుచ్చి యెత్తీ, గిట్టలతో మట్టీ హతము గావించినవి.

బ్రహ్మ : బాగు బాగు, ఆ యావులు పల్నాటిగడ్డన బుట్టినవి గదా ! చారకొద్దీ గొడ్డూ, కోరకొద్దీ పులీ అన్నారు.

క. దా : అంతట హతశేషులు గోవులనువదలి గోపాలురనే తలపడ్డారు.

బ్రహ్మ : పల్నాటిలో పచ్చికనబుట్టిన పౌరుషము వశువులతో ఆగిపోతుందనుకున్నారుగామాలె. పండిపాతళ్లునిండి వీరుల రక్తములో వెల్లువగట్టింది.

క. దా : అంతట పోరు ఘోరమయింది. కోయలూ, చెంచులూ వికారధ్వనులతో అడవిమృగాలవలె కమరబడ్డారు. అప్పుడు వుభయులకూ జరిగిన యుద్ధము మనుష్యుల పోరువలెగాక వానర, రాక్షసయుద్ధంవలె ఘోరమై తోచినది. అడవిలో వున్న క్రూరమృగములన్నీ బాసటయై యిరువాగులా జేరి కోరలతోనూ, గోళ్లతోను పోరాడుతున్నట్లు కనబడ్డది. చెంచులు నిరాయుధులయిన గోపాలుర పెక్కండ్ర నుక్కడంచారుగాని, లంకన్నయొక్క బారుటీటె పోటులకూ, కత్తివాతి సరుకులకూ నిలువరించ లేక పరుగెత్తారు.