పుట:Naajeevitayatrat021599mbp.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేయకూడదో చెప్పమని" అడిగాడు. ఆయన సమాధానం విని కింది కోర్టు తీర్పు రద్దు చేశాడు. అంతటితో ఆ కేసుముగిసింది.

అక్కడినించి నా ప్రతికూల పక్షంవారు తమ ఆయుధాలు ఇంక తిన్నగా నామీదే ప్రయోగించడానికి పూనుకున్నారు. రాజమహేంద్రవరంలో కాకి కృష్ణమూర్తి అనే ఒక వైశ్యప్రముఖుడు ఉండేవాడు. 10, 12 ఏళ్ళ వయస్సు వున్న అతని కుమారుడు తోటిపిల్లలతో గోదావరికి స్నానానికి వెళ్ళి, ఏ కారణంచేతనో కాలుజారి, నీటిలో పడి చనిపోయాడు. ఆ పిల్లవాణ్ణి పెరుమాళ్ళ రంగయ్య అనే అతని బంధువు కొందరు హంతకుల్ని ఏర్పాటుచేసి చంపించాడని ఒక కేసు వచ్చింది. ఆ పెరుమాళ్ళ రంగయ్యకూడా అప్పటికి రాజమహేంద్రవరం లక్షాధికారుల్లో లెఖ్ఖ. అతను అప్పటికి చాలాకాలం క్రితంనించీ నాక్లయంటు. మునిసిపల్ ప్రతికక్షులు ఆ పెరుమాళ్ళ రంగయ్యకి నేను సలహా ఇచ్చాననే ఆరోపణచేసి, నన్ను ఆ కేసులో ఇరికించాలని బ్రహ్మ ప్రయత్నం చేశారు. అప్పుడే పిఠాపురంవారి కేసులో పనిచేస్తూ ఉన్న మద్రాసు వకీలు వి. కృష్ణస్వామయ్యరుగారు రాజమహేంద్రవరం వచ్చారు.

ఆయన ఒకరోజున క్లబ్బులో సుబ్బారావు పంతులుగారు మొదలయిన వాళ్ళంతా ఉండగా, "ప్రకాశం కుర్రవాడు. సెకండుగ్రేడు ప్లీడరు. హేమాహేమీలైన మిమ్మల్ని అందరినీ ఓడించి ఛైర్మన్ అయ్యాడు. మీ ప్రతిభ ఇంతేనా!" అని హేళన చేశాడు. అందుచేత వాళ్ళ పట్టుదల మరింత హెచ్చయింది. ఆ కారణంవల్ల నన్ను ఎల్లాగైనా ఈ హత్యకేసులో ఇరికించాలని సంకల్పించారు. ముఖ్యంగా పెద్దాడ సాంబశివరావు, ములుకుట్ల అచ్యుతరామయ్యగార్లు బహిరంగంగా దీనికి పూనుకున్నారు. దీంట్లో పంతులుగారిసలహా, వెంకటరెడ్డిగారి ఎరుకా కూడా లేకపోలేదు. మొదటి పెద్దలిద్దరూ ఇద్దరు వడ్రంగి కుర్రవాళ్ళని తయారుచేసి వాళ్ళచేత హత్యజరిగిన క్రితం రోజుని 11 గంటలకి కోర్టుకి వస్తూ ఉంటే నాళంవారి సత్రంసమీపంలో పెరుమాళ్ళ రంగయ్య నాకు ఎదురుపడ్డాడనీ, అక్కడ నా డాకార్టుఆపి అతనితో మాట్లాడాననీ, ఆ మాట్లాడడంలో చనిపోయిన కుర్రవాడి అనంతరం కాని తనకి