పుట:Naajeevitayatrat021599mbp.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కూడా ఎంతో ఆత్రతగా వుండేవాడు. కృష్ణారావుపంతులుగారి ధోరణిని పట్టి ఆయన వాలకం కనిపెట్టాను. ఆయన ఆరాముదయ్యంగారికి శిక్షవేసే ధోరణిలో పడ్డాడు. ఏమి బలం లేని కేసు మోపు చెయ్యడానికి మేజస్ట్రీటు చెయ్యగలిగిన సహాయం అంతా చేశాడు. చివరికి, 120 పేజీల జడ్జిమెంటు వ్రాసి, ఒకనాటి మధ్యాహ్నం 11 గంటలవేళ 6 నెలలు శిక్ష విధించాడు.

ఆ తీర్పు అంతా వెంటనే కోర్టులో చదవమని పిటీషన్‌పెట్టి, ఆయన చదువుతూ వుంటే నోట్సు వ్రాసుకోమని ఒక జూనియర్ వకీలుకి అప్పచెప్పి, తిన్నగా నా ఫీటన్‌మీద సబ్‌కలెక్టర్ విస్ దగ్గిరికివెళ్ళాను. ఈ కేసు సమాచారం అంతా ఆయనతో చెప్పి, నాకు సహాయం చేసిన పక్షంమీద కక్ష కట్టి, భాస్కర రామయ్యగారిని ప్రోత్సహించి అచ్యుతరామయ్య ప్రభృతులచేత కేసు పెట్టించారని నచ్చజెప్పి, అప్పీలు దాఖలుచేసి బెయిలు అడిగాను. "జడ్జిమెంటు కాపీలు వగైరాలు లేకుండా ఎట్లాగా?" అని ఆయన సంకోచించారు. కాని, నా కోరిక పైని బెయిలు ఇచ్చి గుమస్తాచేత పంపిస్తానన్నారు. అల్లాగ కాదనీ, ఆ బెయిలు ఆర్డరు స్వయంగా పట్టుకుని వెళ్ళడ్డానికే నేను వచ్చాననీ చెప్పిన మీదట. ఆయన గుమాస్తాని పిలిచి, బెయిలు ఆర్డరు వ్రాయించి నాచేతికి ఇచ్చారు. వెంటనే రెండు దౌడుల్లో కోర్టులోకి వచ్చాను.

నేను వచ్చేసరికి మేజస్ట్రీటు ఇంకా తీర్పు చదువుతూనే వున్నాడు. అచ్యుతరామయ్య ప్రభృతులు మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఆ తీర్పు చదవడం పూర్తి కావడంతోనే నేను దొర ఆర్డరు మేజస్ట్రీటు ఎదట పెట్టేసరికి మేజస్ట్రీటు, ప్లీడర్లు, పార్టీలు అంతా కూడా స్థబ్దులై పోయారు. అప్పటికి ఆరాముదయ్యంగారు జైలుముఖం చూడకుండా తప్పించగలిగాము. తరవాత విస్ దగ్గిర జడ్జిమెంటు కాఫీకి ఫైలు చేశాము. అతను కాకినాడలో కేసు విచారించాడు. కేసు చూస్తూండగానే అది పార్టీ కక్షలచేత వచ్చిన వ్యవహారం అని గ్రహించి, అప్పీలెంటు తరపున నేను మాట్లాడకుండానే, ఎదట పార్టీతరపున హాజరైన బారిష్టర్ బర్టం రాఘవయ్యగారిని, "క్రింది కోర్టు తీర్పు ఎందుకు రద్దు