పుట:Naajeevitayatrat021599mbp.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏమైతేనేమి! అత్యధిక సంఖ్యాకులచేత నేను ఎన్నుకోబాడ్డాను. అచ్యుతరామయ్యకి రెండో మూడో వోట్లు వచ్చినట్లు జ్ఞాపకం. ఎన్నిక అయిన తరవాత అచ్యుతరామయ్య ఏదో ఎలెక్షన్ పిటీషన్ దాఖలు చేశాడు. అందులో అతను తప్ప రెండోవాడెవడూ దస్కతు పెట్టలేదు. అప్పటినించీ సుబ్బారావుపంతులు ప్రభృతులు నా ఎన్నిక గెజెట్ కాకుండా చేయించడానికి ఎంత ప్రయత్నం చెయ్యాలో అంతా చేశారు. చాలా ఆశ్చర్యకరములూ, అపూర్వములూ అయిన పద్ధతులన్నీ అవలంభించారు. నాకు వయస్సు తక్కువనీ, ఆస్తి లేదనీ, మునిసిపల్ సొమ్ము దుర్వినియోగం చేస్తాననీ, మనుష్యుల్ని హడలు గొట్టేస్తాననీ, చాలా స్వతంత్రుణ్ణి అనీ, గవర్నమెంటుకి వ్యతిరేకుణ్ణి అనీ వ్రాసి పిటీషన్లు ఇచ్చారు. కలెక్టరుతో చాడీలు చెప్పారు. హేమ్నెట్‌ ద్వారా మునిసిపాలిటీల మెంబరైన ఫోర్‌బ్సుతో అనేకమైన చాడీలు చెప్పారు. అచ్యుతరామయ్య, కె. వి. రెడ్డినాయుడుగార్ల దొంగసంతకాలతో ఆకాశరామన్న అర్జీలు ఇప్పించారు. నేను కోలాచలం వెంకట్రావుగారి ఎన్నికసందర్బంలో కాసులు పంచిపెట్టి సభ్యుల్ని మోసం చేశానన్నారు.

ఈ విధంగా నేను ప్రజా ప్రతినిధులచేత ఎన్నుకోబడ్డ ఎన్నిక మూడు మాసాలపాటు గెజెట్ కాకుండా చెయ్యగలిగారు. ఆ రోజుల్లో ఎన్నిక గెజెట్ కాకపోతే ఛైర్మన్ చార్జీ పుచ్చుకోవడానికి వీలులేదు. నేను "ఎవరెన్ని చేస్తేమాత్రం ఏముంది? క్రమంగా జరిగిన ఎన్నిక ఎవరు రద్దు చేస్తా,"రనే మామూలు ధీమాతో వుండేవాణ్ణి.

ఇంతలో గవర్నరు ఆంప్టల్ రాజమహేంద్రవరం వచ్చాడు. అప్పుడు తాత్కాలికంగా ఛైర్మన్ అయిన విప్ తన అధికారం కూర్మా వెంకటరెడ్డి నాయుడుగారికి ఇచ్చి ఆయనచేత కౌన్సిలు అడ్రస్ చదివించాడు. గవర్నరు వచ్చినప్పుడు నన్ను ఛైర్మన్ ఎలెక్టుగా కూడా పరిచయం చెయ్యలేదు. తరవాత, నామీద గవర్నమెంటుకి పంపబడిన పిటీషన్లు అన్నీ విచారణకి వచ్చాయి. సామాన్యంగా ఈ పిటీషన్లు గవర్నమెంటుమెంబరు కలెక్టరుకీ, కలెక్టరు సబ్‌కలెక్టరుకీ, ఆయన తహసిల్దారుకీ, అతను గ్రామమునసబుకీ పంపించి, ఆచోకీ తియ్యడం