పుట:Naajeevitayatrat021599mbp.pdf/908

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రఖ్యాత గాయనీమణి కుమారి సూర్యకుమారి అన్నదమ్ములతోబాటు వెక్కివెక్కి ఏడుస్తూ, అడుగులు తడబడుతూ మంచుపలకలతో పేర్చిన ఆ మహావేదిక నెక్కి, పెదతండ్రి ప్రకాశంగారి భౌతిక దేహదర్శనం చేసింది.

కడసారి భూతలయాత్ర

సాయంకాలం నాలుగు గంటలయింది. చండభానుని ఉగ్రత తగ్గ నారంభించింది. ప్రకాశంగారి దేహాన్ని మంచుపలక వేదికపై నుంచి దించి, పోలీసు దళానికి చెందిన ఒక మోటారు వాహనంలో ఉంచారు. ఆ వాహనానికి ముందుగా చాలా పెద్ద పూవుల దండ అమర్చారు.

ప్రకాశంగారి భౌతికదేహం భూతలంపై కడసారి యాత్రకు తరలింది.

ముందుగా ముఖ్యమంత్రి సంజీవరెడ్డిగారు, మంత్రులైన కళా వెంకటరావు, బసవరాజు గారలు, వెంట ముఖ్యకార్యదర్శి పాయ్‌గారు, ఆ ప్రక్కనే అల్లూరి సత్యనారాయణ రాజుగారు, సచివాలయంలోగల పెద్ద ఉద్యోగులు, పౌర ముఖ్యులు - ఆ వాహనం ముందుగా నడిచారు.

వారి వెంట మోటారు సైకిళ్ళపై పోలీసు ఉద్యోగులు, వారి వెనుక పోలీసు బాజా బజంత్రీలు (బేండ్), వారి వెనుక పదాతులైన పోలీసు దళాలు, వారి వెనుక శాసన సభ్యులు, పొర ముఖ్యబృందములు, వారి ననుసరించి వేలాది ప్రజాసామాన్యము అబిడ్స్ రాజమార్గం, బేంకురస్తాల గుండా కాచిగూడా రస్తాలమీదుగా నడిచి అంబర్‌పేట శ్మశానవాటిక చేరారు.

"ఎంత మనిషి పోయాడండీ!" "ఇంతటి అతను మరొకరు మళ్ళీ మనమధ్య పుడతాడా?" అనే మాటలుతప్ప ఇతరమైన మాటలు రాలేదు.

ప్రకాశంగారి భౌతికదేహాన్ని చివరిసారిగా చూడడానికి వచ్చిన లక్షల ప్రజల నోళ్ళనుండి అనుకోకుండానే ఈ మాటలు వెలువడడం జరిగింది.