పుట:Naajeevitayatrat021599mbp.pdf/905

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కార్యక్రమం రద్దు చేసుకొని, తెల్లవారేసరికి వస్తున్నట్టు తంతివార్త ఇచ్చారు.

ప్రకాశంగారిపై గౌరవ సూచకంగా, ప్రభుత్వ కార్యాలయాలకు ఆ రోజు సెలవు ప్రకటించారు. ఉదయం రేడియోలో - ప్రకాశంగారు స్వర్గస్థు లైనారన్న వార్త విని, ఉస్మానియా హాస్పిటలు ఆవరణలో వేలకొద్ది ప్రజలు క్రిక్కిరిసి పోయారు. ఒక్క అరగంటలో ఆ పరిసరాలలో గల రస్తాలన్నీ బహుజన సంకీర్ణములై నాయి.

జీవితకాలంలో, విశ్రాంతి అన్న మాట వినడానికి సహించని నాయకమణి, ఇపుడు దీర్ఘ విశ్రాంతి తీసుకుంటున్నట్టు - ప్రకాశంగారి ముఖము కనిపించింది. వడదెబ్బకు తట్టుకోలేక ఆసుపత్రికి చేరిన ఆ శరీరము, అతి శీతలమైన మంచు పలకల మధ్య ఆ వడదెబ్బను పోగొట్టుకుంది.

అప్పటికి 56 సవత్సరాలక్రిందట, స్వాతంత్ర్యోద్యమంలో చేరినవాడు, ఆయనను విడిపోయిన చందనాది పరిమళ ద్రవ్యాలు, సుగంధ కదంబ పుష్ప మాలికలు - ఇప్పుడు ఆయన ముఖం తప్ప మిగిలిన శరీర భాగాలన్నిటినీ ప్రీతితో తమలో ఇముడ్చుకున్నవి.

అంతలోనే - గోదావరి, కృష్ణా, గుంటూరు, ఖమ్మం మొదలైన జిల్లాలనుంచి దొరికిన రైళ్ళలో, బస్సులలో, కార్లలో వచ్చిన వేలకు వేలు ప్రజలు హైదరాబాదు నగరంలో నిండిపోయారు.

ఉదయం 8 గంటలయింది. ప్రకాశంగారి భౌతికదేహాన్ని వహించే భాగ్యం పొందిన అంబులెన్సు బండి ఆ దేహంతో గాంధీ భవనం, చేరుకుంది. గాంధీ భవనం, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు సంఘ భవనము.

సాయుధ పోలీసు దళాలు అంబులెన్సు ముందుగా నడిచాయి. వారి వెంట మంత్రులు, కార్యదర్శులు, ఉద్యోగులు నడిచారు. వారిని ప్రజా తరంగాలు అనుగమించాయి.