పుట:Naajeevitayatrat021599mbp.pdf/898

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను, దేబరుగారు, శాస్త్రిగారు మాట్లాడుతున్న సమయంలో రంగాగారు మా మాటలు వింటున్నారో లేదో తెలియదు. ఆయన మరేదో ఆలోచిస్తూ కూచున్నట్టుగా, కొంచెం ఎడంగా ఉన్నారు. ఆయన, గోపాలరెడ్డి విషయం చెప్పడానికి వచ్చినట్టుగా నాకు తెలుసు. ఆ వసతి గృహంలో ఆతిథ్యపు ఏర్పాట్లు కూడా, గోపాలరెడ్డిగారి నాయకత్వాన్ని బలపరచడానికి యత్నిస్తున్న వి. రామకృష్ణగారే చేశారు.

నేను అన్నదానిపైన దేబరుగారు నాతో, "పోనీ, ప్రకాశంగారితో మీరు మాట్లాడిరండి," అన్నారు.

"మీరూ వస్తే బాగుంటుంది గదా," అని నే నంటే, "అక్కరలేదు. మీరు వెళితె చాలును," అన్నారు.

ఆయనతోను, శాస్త్రిగారితోను - "నేను ప్రకాశంగారితో మాట్లాడివచ్చి, ఆయన చెప్పినది మీతో చెప్పే వరకు, మీరు ఏ పేరూ సూచించకుండా ఉండాలి సుమండి!" అంటే, దేబరుగారు "అలాగే, మీరు వచ్చేవరకు ఏ పేరూ పైకి చెప్పబోము," అని అసందిగ్ధంగా చెప్పారు.

నేను రోడ్డు అవతల ఉన్న విశ్రాంతి భవనానికి, ప్రకాశం గారితో మాట్లాడడానికి వెళ్ళాను.

ఎండలో తిరిగి తిరిగి రావడంవల్ల, ఆయన నిద్రపోతున్నారు. ఆయనను లేపడానికి యత్నించాను. ఆయన లేవలేదు. ప్రక్కగదిలోకి వెళ్ళి, సంజీవరెడ్డి గారితో, "దేబర్‌గారు ఏదో ఆలోచనలో ఉన్నట్టుంది. మీరు మాత్రం మెత్తపడకండి," అని అ ఒక్క ముక్క మాత్రం చెప్పి, తిరిగివచ్చి ప్రకాశంగారిని లేపాను.

ఆయన మెల్లిగా కళ్ళు విప్పి, "ఏమి జరుగుతున్నదయ్యా?" అని నన్నడిగారు. ఆయనతో నేను దేబర్‌గారితో మాట్లాడిన విషయం గురించి రెండు మూడు వాక్యాలు చెప్పేసరికి, లాల్ బహదూర్‌శాస్త్రి గారు గది గుమ్మందగ్గరికి వచ్చేశారు. నేను ఆయనను చూసి, "ఏమిటి శాస్త్రిగారూ! అపుడే మీరిక్కడికి వచ్చేశారేమిటి?" అని ప్రశ్నించాను. ఆయన, "దేబర్‌జీ - గోపాలరెడ్డిగారి పేరు వెల్లడించారు," అన్నారు.