పుట:Naajeevitayatrat021599mbp.pdf/896

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను దిగి వచ్చేసరికి ఆయన - కారులో, తడి తువ్వాలు ఒకటి నెత్తిపైన వేసుకుని, దగ్గరగా ఉన్న ఒక పల్లెటూరికి వెళ్ళుతున్నట్టు చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో మేమంతా ఉన్నప్పుడు, ఒక తెలుగు మంత్రిపై, ఒక డెటిన్యూ సంబంధంలో ఆయన చేసిన అధికార దుర్వినియోగం గూర్చి, ప్రకాశంగారికి ఎఫిడవిట్ (వ్రాసిన విషయాలు సత్యమనే ప్రమాణ) పూర్వకంగా ఆ గ్రామంలో ఒకరు ఫిర్యాదు చేశారు.

అయితే - ఆరేడేండ్ల క్రింద జరిగిన వ్యవహారం గనుక అప్పుడు ఆ విషయాలను గూర్చి దోషారోపణ చేసినవారు యిప్పుడు అవసరమైతే సమర్థిస్తారో లేదో నిర్ధారించుకొనేందుకు, ఆ మండుటెండలో, అట్టే వ్యవధిలేని ఆ రోజున, అత్యవసరంగా ఆయన బయలుదేరారు.

83 సంవత్సరాల వయసులో ఆయన కున్న పట్టుదల, రాజ్యం పెద్దరికంలోకి రావలసినవారు, అధికార దుర్వినియోగం చేయనివారు కావాలనే దీక్ష అక్కడ ఉన్న మా కందరికీ ఆశ్చర్యం కలిగించాయి.

ఆ ఎండలోనే తిరిగి వచ్చి, ఆయన తాము బసచేసిన పి. డబ్ల్యూ. డి. వసతి గృహంలో నిద్రపోయారు.

ఆ సమయంలో నేను అక్కడికి ఫర్లాంగు కన్న తక్కువ దూరంలో ఉన్న ప్రభుత్వ అతిథి గృహానికి (స్టేట్ గెస్ట్ హౌస్) దేబరుగారిని, శాస్త్రిగారిని చూడ్డాని కని వెళ్ళాను.

ప్రకాశంగారు బసచేసిన గదికి ప్రక్కగదిలోనే తానూ బస చేసినా - సంజీవరెడ్డిగారు, ఆయనతో అట్టే దోస్తీగా మాట్లాడుతున్నట్టు కనిపించలేదు. సంజీవరెడ్డిగారు తన మటుకు తాను, తానే నాయకుడుగా ఎన్నిక కావాలనే యత్నంలో ఉన్నట్టు కనిపించింది.

కాని, కాంగ్రెసు పక్షంవాడు గనుక, ఆయన - దేబర్, శాస్త్రిగారలతో మంచిగా ఉండడానికి యత్నించడం సహజము.