పుట:Naajeevitayatrat021599mbp.pdf/895

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వివాదస్పదమైన కొన్ని పేర్లు శాస్త్రిగారికి వదిలినప్పుడు, ఆయన వ్రాతపూర్వకంగా తన తీర్పు చేసేవారు. అందులో చాలా తీర్పులు నా వాదాన్ని త్రోసిపుచ్చేవిగానే ఉండేవి.

ఎలాగయితేనేమి 196 సీట్లకు (స్థలాలకు) 167 నియోజక వర్గాలలో అభ్యర్థులను నియమించాము. ఈ 167 నియోజక వర్గాలలో, 133 ఏక సభ్య నియోజక వర్గాలు.

ఎన్నికల్లో, నావల్ల ప్రతిపాదింపబడ్డ ఎన్నికల వ్యూహం చాలా బాగా పనిచేసింది. 196 సీట్లలోనూ, 147 యునైటెడ్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీకి సంప్రాప్తించినవి. పాత శాసన సభలో దాదాపు 40 సీట్ల దాకా ఉన్న కమ్యూనిస్టు పార్టీకి, ఈ మారు 14 సీట్లే దక్కాయి.

నేనుమాత్రం నా ఎన్నికలో ఓడిపోయానని ఇదివరలోనే వ్రాశాను.

తొందరపడి మా మీద విశ్వాసరాహిత్య తీర్మానం తేకపోయి ఉంటే, ఇంకా ప్రతిపక్షంవారు తమ మాట జరిపించుకుంటూ ఉండగలిగేవారు. ప్రగతిపథాన పయనించే ప్రకాశంగారి మంత్రివర్గం జరుగుతూండడానికి అవకాశం ఉండేది. ఆ విధంగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే విశాలాంధ్ర ఏర్పాటయి, ప్రాంతీయఖండాలు లేనట్టి విశాలాంధ్ర పరిపాలన సామరస్య సౌష్ఠవాలు కలిగిఉండేది.

అయితే, జరగవలసిన చరిత్రను ఎవరు మార్చగలరు?

నాయకుని ఎన్నిక విషయము

ఢిల్లీలో ఉన్న కాంగ్రెసు అధిష్ఠాన వర్గం వారికి, తమ బలవత్తరమైన ప్రమేయం లేకుండా, పార్టీ శాసన సభ్యులు నాయకుని ఎన్నుకోవడం ఇష్టంలేదు. అందుచేత, లాల్‌బహదూర్‌శాస్త్రి, కాంగ్రెసు అధ్యక్షులు దేబర్ గారలు విజయవాడకు వచ్చారు. వారు - చర్చలు సలహాలు వారితో వీరితో చేశారే కనీ, ప్రకాశంగారితో ఏమీ చర్చించలేదు.

ప్రజాపార్టీనుంచి వచ్చిన సభ్యులమంతా రామమోహనరాయ్ హాలులో సమావేశ మయ్యాము. మంచి ఎండవేళ. ప్రకాశంగారు ఆ హాలు దగ్గరికి వచ్చి, లోపల ఉన్న నాకు కబురు చేశారు.