పుట:Naajeevitayatrat021599mbp.pdf/893

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొంత చనువు తీసుకొని నాతో అన్నారు: "మీ రెండు పార్టీలు - అంటే, ప్రజాపార్టీ, కృషికార్ లోక్‌పార్టీ కాంగ్రెసు పార్టీకన్నా తక్కువ సంఖ్యాబలం గలవి. అందుచేత, కాంగ్రెస్‌పార్టీ పేరు శాస్త్రిగారు ఉంచారు. మీతో కలియడంవల్ల 'సంయుక్త' అన్నమాట చేర్చారు. మీ పార్టీల వ్యక్తిత్వం ఇందులో పోలేదు, కాంగ్రెసు పార్టీ - మీ శాసన సభలలో ఉన్న పార్టీ అన్నిటికన్నా పెద్దది. దాని పేరే లేకుండా చేయడం మీ ఉద్దేశమా? ఈ సమయంలో అందరూ కొంత ఉదారంగా వ్యవహరించాలి."

కె. ఎల్. పి. ప్రతినిధి ఈ పేరు విషయం అంతగా పట్టించుకోలేదు. ఆ పరిస్థితిలో - అంతవరకు వచ్చిన కలయిక 'పేరు' కోసం నా ప్రతిపాదనవల్ల పాడు చేయడం మంచిదికాదని నా మనసులో ఊహించుకొని నేను కూడా అంగీకరించాను. దీంతో మూడు పార్టీల కలయిక, ఒకే ఎలక్షన్ మేనిపెస్టో అన్న నా ఎన్నికల వ్యూహం - అంతవరకు జయప్రదమైంది. ఇక మిగిలినవి అభ్యర్థులను ఎన్నుకొనే సంఘం ఏర్పాటు చేయడము; కూచుని కార్యక్రమం ఆరంభించడమూ,

సెలక్షన్ సంఘము - కార్యక్రమము

సెలక్షన్ సంఘంలో కాంగ్రెసు తరపున పార్టీ అధ్యక్షులయిన గోపాలరెడ్డిగారు, ప్రజాపార్టీ తరపున నేను, కె. ఎల్. పి. తరపున రంగాగారు పంపిన కందుల ఓబుల్‌రెడ్డిగారు సభ్యులము. మా కార్యక్రమం జరుపుకోడానికి విజయవాడలో జి. ఎస్. రాజుగారి భవనాన్ని రంగస్థలంగా ఎన్నుకున్నాము.

జి. ఎస్. రాజుగారు సంపన్న గృహస్థు. ఔషధాల ఉత్పత్తి పరిశ్రమ ఒకటి అప్పుడే స్థాపించి, అభివృద్ధి చెందుతూన్నవారు. తర్వాతి రోజులలో కాంగ్రెసులో చేరి, శాసన మండలికి ఉపాధ్యక్షుడుగా కూడా కార్యభారం వహించిన ప్రముఖులు. ఆయన తన భవనం మా సమావేశానికి ఇవ్వడమేగాక, అక్కడి సమావేశానికి వచ్చిన మాలో చాలామందికి, ఆతిథ్యం కూడా ఇచ్చేవారు.

మా ఉపసంఘంలో మొదట ఒక తీర్మానం చేసుకున్నాము.