పుట:Naajeevitayatrat021599mbp.pdf/888

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాంగ్రెసులో కలియడానికి అప్పుడు అంగీకరించలేదు. అందుచేత, రాయబారులు వారి సభకు వెళ్ళిపోయారు.

ఆ రాత్రి, ప్రకాశంగారిని చూడడానికి, ఆయన బసకు వెళ్ళిన పార్టీ సభ్యులు కొందరు, ఆయనను, 'కాంగ్రెసులో కలిసిపోతున్నారన్న వార్త వాస్తవమేనా?' అని ప్రశ్నించారు. ఆయన 'చేరితే ఏం ప్రమాదమా?' అని మారుప్రశ్న వేశారు.

ఆయన నన్ను, "ఏమి! కాంగ్రెసులో చేరకూడదా నువ్వు?" అని అడిగారు. పార్టీలో ఎవరికీ ఇష్టం లేదని, జవాబిచ్చాను. "సరే, అలాగయితే మీరు అనుకున్నట్టే చేసుకోండి," అన్నారు ఆయన

తర్వాత కొంతకాలానికి ఆయన ఢిల్లీ వెళ్ళడం తటస్థించింది. అది డిసెంబరు నెల. ఆయన ఢిల్లీనుంచి నా కొక తంతి యిచ్చారు. అందులో "తనను కలుసుకోమని నెహ్రూగారినుంచి ఆహ్వానం వస్తే, నువ్వు తిరస్కరించబోకు సుమా!" అని ఉంది.

మరి రెండుమూడు రోజుల్లో అలాగే నెహ్రూగారి నుంచి, అందులో వ్రాసిన తేదీకి వచ్చి, తనను కటకంలో కలుసుకోవలసిందని ఆహ్వానం వచ్చింది. నేను ఆయన అన్న తేదీకి కటకం చేరుకున్నాను.

మధ్యాహ్నం - నెహ్రూగారు, నేను ఒకరి నొకరు పలకరించుకోవడం , గవర్నరుగారి బసలో జరిగింది. నెహ్రూగారు, నన్ను మొదట బలవంతరాయ్ మెహతా [1]తో మాట్లాడవలసిందనీ, రాత్రి భోజనానంతరం కలిసి కూర్చుందామనీ చెప్పి, మెహతాగారిని, నన్ను ఒక గదిలో కూచోపెట్టి వెళ్ళిపోయారు.

మెహతాగారు చెప్పిందే చెప్పుతూ, రెండు గంటల సేపు, నన్ను కాంగ్రెసులో చేరమని మనోక్షాళనం చేయసాగారు. కాని, అటువంటిదానికి లొంగే లక్షణం నాలో లేదని ఆ రెండు గంటలతర్వాత ఆయన గ్రహించారు.

  1. ఆయన ఆలిండియా కాంగ్రెస్ కమిటీకి ఒక జనరల్ సెక్రటరీగా ఉండేవారు. తర్వాత, భాషా రాష్ట్రాలు ఏర్పడిన పిదప గుజరాత్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. అలా ఉన్నప్పుడే పాకిస్థాన్‌కు, మనకు ఒక చిన్న యుద్ధం ప్రారంభమయింది. రాష్ట్ర పరిపాలనాకార్యక్రమ సందర్భంలో, ఆయన వెళుతున్న విమానాన్ని పాకిస్థాన్ వారు కూల్చి వేశారు. ఆయన అసువులు బాశాడు. భారతదేశం అనుపమాన దేశభక్త రత్నాన్ని కోల్పోయింది.