పుట:Naajeevitayatrat021599mbp.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్లీడరులు కూడా సబ్ కలెక్టరుకి వ్యతిరేకంగా పనిచెయ్యలేరని, అందుచేత విజయం నిశ్చయమనీ చెప్పి బాగా పురి ఎక్కించారు. ప్రభుత్వోద్యోగంతోబాటు ప్రజల ప్రాతినిధ్యం కూడా లభిస్తే ఆయనకి ఎక్కువ గౌరవంగా వుంటుందని హెచ్చరిక చేశారు. దాంతో రైస్ బోల్తా కొట్టాడు. కాబోలంటే కాబోలనుకుని కాన్వాసింగు ప్రారంభించాడు.

అప్పటికి దుర్గయ్యగారి ఛైర్మన్ గిరీ టైము అయిపోవడం చేత సబ్ కలెక్టరే తాత్కాలికాధ్యక్షుడు, రైస్ నా అభిప్రాయం కనుక్కోవడానికి మునిసిపల్ సెక్రటరీ దామరాజు బసవరాజుని నా దగ్గరకి పంపించాడు. ఆయనవచ్చి నన్నడిగినప్పుడు నేను నిర్మొహమాటంగా "నా వోటివ్వను సరిగదా! నా కంఠంలో ప్రాణం వున్నంతవరకూ ఆయన కాకుండా సర్వశక్తులూ వినియోగిస్తాను. ఇది వుద్యోగులు కాని వాళ్ళ కోసం ఏర్పడిన పదవి అయివుండగా, తను ఇందులోకి రావడం అప్రశస్తమని నా మాటగా చెప్పండి!" అని చెప్పాను. బహుశ: ఆయన ఆ మాటలు రైస్ తో చెప్పేవుంటాడు.

ఇక మాఛైర్మన్ అభ్యర్థి నిర్ణయంలో నా విషయం మొదట చర్చకి వచ్చింది. నా వయస్సు అప్పటికి సుమారు 27, 28 సంవత్సరాలు మాత్రమే. నాకు అంత చిన్న వయస్సులో ఛైర్మన్ పదవికి తొందరపడకూడదనిపించింది. దాంతోపాటు నా కిప్పుడు స్ఫురణకు రాని ఎన్నో కారణాలు తోడయ్యాయి.

అప్పటికి కొద్దికాలం కిందట మోచర్ల రామచంద్రరావు పంతులుగారు (తరవాత సర్) బి.ఏ., బి.ఎల్. పాసయి సుబ్బారావు పంతులుగారి దగ్గిర జూనియర్ గా ప్రవేశించారు. ఆయన అక్షరాలా పంతులుగారి శిష్యుడే. వేషంలో కూడా సరీగా అల్లాగే వుండేవాడు. ఆఖరికి చేతికర్ర కూడా అల్లాగే పట్టుకునేవాడు. సుబ్బారావు పంతులుగారి పలుకుబడి వల్ల ఆయన కూడా మునిసిపాలిటీలో నామినేటెడ్ కౌన్సిలర్ గా చేరారు. మేము ఆయన్ని ఛైర్మన్ గా పెట్టడానికి సంకల్పించాము. ఈ నిశ్చయం ఏలూరి లక్ష్మీనరసింహంగారికి మరింత కష్టం కలిగించింది. వాస్తవానికి లక్ష్మీ నరసింహంగారికీ సుబ్బారావుపంతులుగారికే పార్టీ. లక్ష్మీనరసింహం