పుట:Naajeevitayatrat021599mbp.pdf/877

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంత్రులకూమధ్య పరస్పర భేదాభిప్రాయాలు పెంచడంలో కొంత ముఖ్య పాత్ర వహించాడు. ఆయన, ఆంధ్రరాష్ట్ర గవర్నరు కాగానే పంజాబు మంత్రి మిత్రుడు ఒకాయన మాతో అన్నాడు: "ఈ త్రివేది అసాధ్యుడు. మంత్రులమధ్య సామరస్యం ఉండ నివ్వడు. మీరు జాగ్రత్తగా ఉండాలి సుమండీ!"

ఆయన అన్నది ముమ్మాటికీ నిజం అయింది. విభజన సంఘంలో కూచున్నపుడే, రోజుకు ఒకటి రెండు పర్యాయాలైనా చర్వితచర్వణంగా, తాను పంజాబులో గవర్నరుగా ఉండగా, మంత్రులందరూ తన సలహాపైనే కార్యకలాపాలు నడిపేవారని మాకు చెప్పేవాడు.

గవర్నరు అయిన తర్వాత, ఏవో విషయాలు చర్చించాలన్న నెపంపైన మంత్రులను తన యింటికి ఆహ్వానించడం, పరిపాలనా అనుభవంగల గవర్నరు ఉన్నప్పుడు, వారి సలహాపై నడచుకోవడం మంత్రులకు మంచిదని పదే పదే చెప్పడం చేసేవాడు. ఒక పెద్ద పుస్తకంలో ఏయే మంత్రికి ఏయే పాఠాలు చెప్పాలో ముందుగా విషయసూచిక వ్రాసుకొనేవాడు. అ క్రమ ప్రకారంగా మాట్లాడ సాగేవాడు. ఒక పదిహేను రోజులు అయ్యేసరికి ప్రతి మంత్రికీ ఆయనంటే గట్టి విముఖత ఏర్పడింది.

ఆయన ప్రకాశంగారిని మాత్రం పిలవడానికి భయపడేవాడు. తాను చెప్పే ప్రకారం వినే తత్వం ప్రకాశంగారికి లేదని ముందే తెలుసుకున్నాడు.

అందుచేత, ప్రకాశంగారిపై ప్రతి 15 రోజులకు ఒకసారి - ప్రధానమంత్రికి గవర్నరులు వ్రాసే రహస్యపు ఉత్తరాలలో ఏవేవో వ్రాసేవాడు. [1]

  1. స్వాతంత్ర్యానంతరంకూడా గవర్నరులు, పూర్వం గవర్నర్ జనరల్ పేరిట వ్రాసే రహస్యపు ఉత్తరాల లాగా తనపేరిట 15 రోజుల కొక ఉత్తరం చొప్పున, రాజ్యపరిపాలనకు సంబంధించి వ్రాసేటట్టు నెహ్రూగారు ఒక పద్ధతి ఏర్పరిచారు. రాజ్యపాలనకు సంబంధించి ఏయే విషయాలలో రాష్ట్రాల మంత్రిమండలికి స్వాతంత్ర్యముందో, వేటిలో కేంద్రప్రభుత్వం ప్రమేయ కల్పించుకోవాలో - మన సంవిధానంలో స్ఫుటంగా ఉన్నాయి. అందులోని 355, 356 అనుచ్ఛేదాల ప్రకారం గవర్నరులు అవసరమైతే తప్ప కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు వ్రాయవలసిన అగత్యం లేదు. అందుచేత, ప్రధాని రహస్యపు ఉత్తరాలు వ్రాయడానికి చేసిన ఏర్పాటు సంవిధాన తత్వానికి విరుద్ధమని వేరే చెప్పనక్కరలేదు.