పుట:Naajeevitayatrat021599mbp.pdf/875

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏర్పాటు చేయడానికి అప్పుడే సన్నాహాలు జరుగుతున్నాయనీ ఆ సందేశంలో ఉంది.

నేను అనుకొన్నట్టు పని 15 రోజులవరకు అక్కర లేకుండా, వారం రోజులలోనే ప్రజలు సఫలీకృతము చేసి, భారతదేశంలో మిగిలి ఉన్న ప్రెంచి, పోర్చుగీసువారి చేతులలో ఉన్న భూ భాగాలను పునరాక్రమణ చేసుకోడానికి మార్గదర్శకు లయ్యామని నేను ఉప్పొంగిపోయాను.

తెల్లవారేసరికి, పత్రికలలో - చూపుడువేలు ప్రమాణంగల అక్షరాలతో - ప్రజలు యానాము ఆక్రమించుకున్నారనీ, ఫ్రెంచి ప్రభుత్వంవారు పారిపోయారనీ వార్తలు పడ్డాయి.

నేను 10, 11 గంటల వేళప్పుడు నెహ్రూగారిని చూడడానికి వెళ్ళాను.

వెళ్ళగానే, యానాము ఆక్రమణ ప్రసంగం వచ్చింది. "మీ ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తే, అనవసరమైన అంతర్జాతీయ సమస్యలు బయలుదేరితే ఎవరు బాధ్యత వహిస్తారు?" అని కొంచెం చీకాకు చూపించే ముఖంతో అన్నారు. [1]

అది విని నేను, "ప్రభుత్వ సిబ్బందిలో ఒక్కమనిషయినా అంతర్జాతీయ సరిహద్దు దాటి యానాములోకి వెళ్ళలేదు. యానాము కాందిశీకులు తమ పట్టణం తాము పునరాక్రమణ చేసుకొంటే మన మేలాగు అడ్డగలము" అన్నాను.

అయినా, ఆయన ఇలా అన్నారు: "ఏమైనాసరే, యానాం మీ రాష్ట్రంలో కలుపుకోకూడదు. ఫ్రెంచి తత్వం, ఫ్రెంచి సంస్కృతి మనం రక్షించాలి."

  1. స్వాతంత్ర్యం వచ్చి అప్పటికి 6 ఏండ్లయినా, మన ప్రజలు దెబ్బలు తింటున్నా, పోర్చుగీసు, ప్రెంచి ప్రభుత్వాల నుంచి మన భూభాగాలు మనము తీసుకుంటే అంతర్జాతీయ సమస్యలు వస్తాయని భావించే ;దీర్ఘ సూత్రుడు' ప్రధాని నెహ్రూగారు.