పుట:Naajeevitayatrat021599mbp.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిర్మొహమాటంగా తప్పుకున్నారు. అందులోనూ, ఆయన ఘనత ఎక్కడ వుందంటే-ఒకసారి తప్పుకున్నాక మరి ఆ పని చేస్తున్నవాడికి ఇంక అడ్డుపుల్ల వెయ్యకుండా వుండడంలోనే! చేసినన్నాళ్ళూ ఆయన చేశారు. ఇంక బలం లేనప్పుడు మెల్లిగా తప్పుకుని ఎదటివాడికి పూర్తి అయిన అవకాశం ఇచ్చివేశారు. నిజానికి ప్రజాస్వామ్య సంస్థలలో ఇలాంటి పద్ధతి అవలంబించడం చాలా ప్రశంసనీయమైన విషయము.

దుర్గయ్యగారు, తరవాత నామీద పిటీషన్లు వగైరాలు ఇచ్చిన రోజులలో కాని, లేనిపోని కేసులు పెట్టే కాలంలోగానీ, ఎప్పుడూ ఏవిధమయిన జోక్యమూ కలిగించు కోలేదు. అందుకు ఆయన అంటే నాకు చాలా గౌరవం.

దుర్గయ్యగారు వుండనప్పుడు మళ్ళీ ఏలూరి లక్ష్మీనరసింహంగారు ఛైర్మన్ పనికి తయారయ్యారు. "నేను కదా దుర్గయ్యగారికి ఇంతకాలం సహాయం చేశాను ఆయన ఉండకపోతే, మళ్ళీ నేనెందుకుండకూడదు!" అని ఆయన వాదన. కాని నేను ఆయనతో, "మీ మీద ఎన్నో కేసులు ఇదివరకే వ్యాపించి వున్నాయి. పైగా, మీకు చాలామంది శత్రువులు ఏర్పడ్డారు; మీరు నాకు చిన్నప్పుడు అధ్యాపకులు కూడాను. ఆ గౌరవం చేత మీరు తప్పుకోవడం చాలామంచిందండి!" అని సలహా ఇచ్చాను. ఆయనకి మనస్సులో కొంచెం కష్టం కలిగింది. కాని, ఎదట కాదనలేకపోయారు. అయితే, నా సలహా మాత్రం రుచించలేదు. అయినా తమకి నా సహాయం లేనిదే ఆ పదవి లభించే అవకాశం లేదని కూడా గ్రహించారు.

అందుచేత, ఒక పెద్ద ఎత్తు ఎత్తారు. లక్ష్మీనరసింహంగారు కూడా ఎత్తు పైయెత్తు వెయ్యడంలో సుబ్బారావుపంతులుగారికి తీసిపోయేవారు కారు. నెమ్మదిగా స్థానిక సబ్ కలెక్టరు యల్.వి.యస్.రైస్ అనే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఛైర్మన్ పదవికి అభ్యర్థిగా తయారుచేశారు. రైస్ ప్రభుత్వోద్యోగి కనక వుద్యోగులతా వోట్లు ఇస్తారనీ, వర్తకులు మొదలైనవాళ్ళు వ్యతిరేకంగా వుండరనీ, నాబోటి