పుట:Naajeevitayatrat021599mbp.pdf/867

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారు తమ డబ్బుతో నడిపిస్తూన్న కాలేజీలను, విశ్వవిద్యాలయంగా విస్తృతపరుస్తున్నాము. ఆ విషయం అందులో స్ఫుటంగా వ్రాయబడివుంది. ఆ కాలేజీలలో, ఇతర కాలేజీలలో జరుగుతున్నట్టుగానే విద్యాబోధన జరుగుతున్నది

విద్యార్థులకు అన్ని విషయాలూ బోధిస్తున్నారు. ఏ నిషేధమూ లేదు. ఈ కాలేజీలమీద వ్యయం కాకూడదని ఏ భక్తుడూ అనలేదు. అడ్డుపెట్టలేదు.

సంవిధానం వచ్చి ఆరేండ్లయినా ఎవరూ వ్యాజ్యం వేయలేదు. అందుచేత, ఇప్పుడు పురిటిలో మీరు అడ్డుపెట్టడం ఎందుకు? ఎవరయినా అడ్డుపెట్టదలచుకుంటే దాని మంచిచెడ్డలు ఆలోచించే బాధ్యతను సుప్రీంకోర్టుకు ఎందుకు వదలరు మీరు?" అని నేను చెప్పినా, ఆయన తనకే న్యాయశాస్త్ర ప్రావీణ్యమున్నట్టు మాట్లాడసాగాడు.

అప్పట్లో కేంద్ర న్యాయశాఖామంత్రి - కలకత్తా హైకోర్టులో జడ్జీగా పనిచేసి, పదవీ విరమణ చేసిన చక్రవర్తిగారు.

ఆయనతో నే నీ విషయాలు చెప్పేసరికి, అవలీలగా గ్రహించి, కార్యదర్శి దగ్గర వున్న ఫైలు తాను తీసుకొని, ఆయనను పంపించేశారు.

ఆ తరువాత ఆయనా నేను ఒక కారులో బయలుదేరాము.దారిలో చక్రవర్తిగారు, "న్యాయశాఖకు కార్యదర్శులైనవాళ్లు ఒకప్పుడు న్యాయవాదులే అయినా, సచివాలయంలోకి వచ్చి, కొంతకాలం ఉండేసరికి పాలకవర్గ మనస్తత్వంలోకి పడిపోతారు," అంటూ కారులోనే ఆ ఫైలుమీద, అనుమతి ఈయవ'చ్చని వ్రాసేశారు.

ఈ రెండు గండాలు దాటిన తరువాత, ఏడుకొండల వేంకటేశ్వరుని పేరిట స్థాపించిన విశ్వవిద్యాలయ శిశువు దినదిన ప్రవర్థమానమై, నేడు అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో ఒకటిగా విరాజిల్లుతూంది.

ప్రకాశం మంత్రివర్గం చేసిన ఇతర సౌకర్యములు

మంత్రివర్గం అధికారం స్వీకరించిన కొద్ది నెలలలోనే, నేత మగ్గాలపై వేసిన పన్ను, రెండెడ్లబండ్లపై వేసిన పన్ను రద్దు చేశాము.