పుట:Naajeevitayatrat021599mbp.pdf/863

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విద్యాశాఖ మంత్రిగారిని, ఢిల్లీవెళ్ళి, సరిచేసుకొని అనుమతి తేవలసిందని చెప్పగా, ఆయన "ఇలాంటి బిల్లుకు కేంద్రం ఒప్పుకోదని నేను ఇదివరకే చెప్పాను. మీరు నా మాట వినలేదు. ఆ బాధ ఏదో మీరే వెళ్ళిపడండి," అన్నారు.

అప్పుడు కట్జూగారికి బిల్లుకాపీ మరొకటి చేర్చి, ప్రత్యేకంగా మరొక ఉత్తరంవ్రాసి, వారికి బిల్లు పరిశీలన చేయడానికి వ్యవధియిచ్చి, పలానా రోజున వస్తున్నానని తంతియిచ్చి, అ రోజుకు ఢిల్లీ వెళ్ళి, అ ఉదయమే వారి సందర్శనానికి వెళ్ళాను.

ఆయన ప్రత్యుత్థానముచేసి, తేనీరు వగయిరాలన్నీ ఆరగింపు చేయించి, నన్ను "ఏమైనా పనిమీద వచ్చారా?" అని అడిగారు.

నాలుగురోజులక్రింద విశ్వవిద్యాలయ శాసనం కాపీ ఆయనకు పంపినదీ, ఆ ఉదయం ఆయన సందర్శనానికి వస్తున్నట్టు తంతియిచ్చినదీ చెప్పగా, ఆయన ఆ తంతివార్తగాని, బిల్లుగానీ అందలేదన్నారు.

"మీ పెర్సనల్ అసిస్టెంటును పిలిచి కనుక్కోవలసింది," అని నేను అడిగినమీదట, ఆయన తన పెర్సనల్ అసిస్టెంటును పిలిచి, నాపేరు ఆయనకు చెప్పి, నా దగ్గరినుంచి తమకేదైనా తంతివార్త, బిల్లు వచ్చాయా అని ప్రశ్నించారు. ఆయన 'వచ్చిం'దన్నాడు.

నేను "ఎప్పుడు మీకు అందాయి?" అని అడగగా, ఆయన "మూడురోజులయింది," అన్నాడు.

కట్జూగారూ, నేనూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాము. ఆయన పెర్సనల్ అసిస్టెంటును వెళ్ళమన్నారు. అంతకుమించి ఆ విషయం తమకెందుకు చెప్పలేదన్నమాట నోటితో అడగలేదు సరికదా, కంటిచూపులతోనయినా సూచించలేదు!

నేను మరొక్కసారి 'ఇది కదా డిల్లీ పంథా!' అనుకున్నాను.[1]

ఈ ముచ్చట అయినతర్వాత, ఆయనకు ఆ బిల్లు వివరాలు

  1. అంతకు ముందు సంవత్సరం, నెహ్రూ గారికి ప్రకాశం గారు పంపిన తంతి వార్త విషయమై ఇలాగే జరిగిన సంఘటన ఇదివరలో వ్రాశాను.