పుట:Naajeevitayatrat021599mbp.pdf/862

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వరపువారి పేరున ఉన్న సభామందిరం (మీటింగ్ హాలు) లో - ఈ బిల్లు చర్చ, శాంతంగా జరిగింది. 12-5-54 న పట్టాభిరామారావుగారు ఈ బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టారు. 15-5-54 న, శాసన సభ్యుల పరిశీలనా సంఘం (సెలక్టు కమిటీ) పరిశీలన నిమిత్తమై వెళ్ళింది. 26-5-54 న, పరిశీలనా నివేదిక శాసన సభలో ప్రవేశపెట్ట బడింది.

ఈ బిల్లులో -- విశ్వవిద్యాలయానికి, రాష్ట్రగవర్నరు ఉద్యోగరీత్యా 'ఛాన్సలర్‌' గా ఉంటారని వ్రాయడం జరిగింది. కొన్ని విశ్వవిద్యాలయాలలో ఆ రాష్ట్రపు ముఖ్య న్యాయమూర్తి ఛాన్సలర్‌గా ఉండడం కూడా కద్దు.

అనేక సందర్భాలలో - విశ్వవిద్యాలయ వ్యవహారములు, న్యాయస్థానాలలో వాదోపవాదాలకు వస్తువులుగా పరిణమిస్తున్న కాలంలో, అటువంటి వివాదాలలో వాదులు, ప్రతివాదులు ముఖ్యన్యాయమూర్తిపేరు లాగకుండా ఉండడంకోసమని, మేము గవర్నరు ఛాన్సలరుగా ఉంటే బాగుంటుందనుకున్నాము.

అయితే, ప్రతిపక్షులు మా భావాలకు ప్రతికూలభావం కలవారు కాబట్టి - ఉద్యోగాలు మొదలయిన విషయాలలో మంత్రుల సాన్నిద్యాన్నీ, పలుకుబడిన అనుసరించి గవర్నరులు మంత్రుల తాలూకు మనుషులనే ప్రోత్సహిస్తారనే సాధారణ జనాకర్షణీయమమైన వాదం లేవదీసి, 31-5-54 న ఆ శాసనం 10 వ విధిలో 'గవర్నరు' అన్న పదానికి బదులు, 'ముఖ్య న్యాయమూర్తి' అనే పదం సవరణగా ప్రతిపాదించి, నెగ్గారు.

ఆ సవరణతోబాటు 1-6-54 న శాసనం ఆమోదమయింది.

నేను, బిల్లును రాష్ట్రపతి ఆమోదానికై 'రిజర్వు' (రాష్ట్రపతి విచారణార్థము రక్షితము) చేసినట్టు గవర్నరుగారి సంతకం అయిన వెంటనే, ప్రత్యేకమైన ఉత్తరంతో సహా - వేసవికాలపు సెలవులు పూర్తికావడానికి ముందుగా రాష్ట్రపతి అనుమతి యిప్పించవలసిందని, కేంద్ర హోమ్‌ మంత్రి కట్జూగారికి పంపించాను.

ఆయన దగ్గరినుంచి వారం, పది రోజులదాకా ఏ వార్తా రాలేదు.