పుట:Naajeevitayatrat021599mbp.pdf/856

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను, ఆలస్యమయితే లాభంలేదని, అందులో ఎవరో ఒక మంత్రిని పేరుపెట్టి పిలిచి, ఇలా అన్నాను:

"ఫలానా తేదీనాడు మనం హైకోర్టు ప్రారంభించక తప్పదు. గుంటూరులో కావలసిన ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. మనం స్పెషల్ ఆఫీసర్‌ను నియమించవలసిందని, కేంద్ర హోమ్‌శాఖామంత్రి కట్జూగారికి వ్రాయాలి. ఆలస్యంచేస్తే, మనము వేసవి సెలవుల అనంతరం అనుకున్న తేదీకి కోర్టు ప్రారంభించకపోతే బాగుండదు."

మళ్ళీ అందరూ నిశ్శబ్దంగా ఊరుకున్నారు.

అందులో ఒకరు మెల్లిగా, "ఆ స్పెషల్ ఆఫీసర్ ఎవరు కాగలరు?" అని ఏదో ఇబ్బంది ఉన్న భావంతో ప్రశ్నించారు.

నేను, "న్యాయమూర్తి కె. సుబ్బారావు" అన్నాను.

ప్రకాశంగారు, "అవును. అనుమానం ఏమిటి?" అన్నారు.

మంత్రులలో ఒకరు, "అయితే ఇబ్బంది ఏమిలేదు" అని వారి మనసులో బాధ వదిలిపోయినట్టుగా ప్రక్కనున్న మంత్రి మిత్రులతో అన్నారు.

వెంటనే చీకటి అంతా వెలుగై ప్రకాశించింది.

ముఖ్య కార్యదర్శిని తీర్మానం వ్రాయమని, విషయం చెప్పాను. సుబ్బారావుగారిని స్పెషల్ ఆఫీసర్‌గా వేయమనీ, 5-7-1954 న హైకోర్టు ప్రారంభమవుతుందనీ అందులో వ్రాయించాము.

దీని తర్వాత జరుగవలసిన కార్యక్రమం, ఆంధ్ర సచివాలయానికి సంబంధించినంత మట్టుకు చురుకుగానే జరిగింది.

చెన్నపట్నంలో, 1953 సెప్టంబరులో - సచివాలయ విభజన సందర్భంగా జరిగిన చరిత్ర తిరిగీ హైకోర్టు విభజన సందర్భంలో జరగ నారంభించింది.

చెన్నపట్నం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజమన్నారు గారు, మనం చెప్పుకున్న సుబ్బారావుగారికి బావమరదులే. అయినా, ఇక్కడకూడా ఉద్యోగుల కేటాయింపులో ఊగులాటలు, గ్రంథాలయ