పుట:Naajeevitayatrat021599mbp.pdf/855

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లయంలో కాగితాలు కదలడంలో జాప్యమవుతుందని గ్రహించలేక పోయాము. ఆ కారణంచేత - నేను గానీ, ప్రకాశంగారు కానీ కాగితాలు తొందరగా కదులుతున్నాయో లేదో కనుక్కోవడం తటస్థించలేదు.

ఇతర కారణాలవల్ల కూడా, ప్రభుత్వ వర్గాలలో వ్యక్తుల ఉద్యోగాల విషయమై మనస్పర్థలు పెరగడమెలా అలవాటో ఆ విధంగానే ఆంధ్ర ప్రభుత్వంలో ప్రకాశంగారు, సంజీవరెడ్డిగారల మధ్య వైమనస్యం పెరగడం జరిగింది.

ఇంతట్లో వేసవికాలం వచ్చింది. శాసన సభ సమావేశం వాల్తేరులో ఏర్పాటు చేశాము.

ఆ శాసన సభలో చర్చించిన ముఖ్యమైన శాసనము - శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ శాసనము.

దీనిపై దాదాపు 19 రోజులపాటు చర్చలు జరిగిన తర్వాత సభవారు ఆమోదముద్ర వేశారు.

ఇదికాక, మిగిలిన సేల్సుటాక్స్ (అమ్మకం పన్ను) బిల్లుల సవరణలు, ధర్మాదాయ మత సంస్థల సవరణ బిల్లు, వాచక పుస్తకాలను జాతీయం చేయడం మొదలైన వాటితో మంత్రి మండలి కాలం సరిపోయేది.

ఒక పర్యాయం, నేను ఈ హైకోర్టు విషయమై ప్రకాశంగారితో గట్టిగా చెప్పడం తటస్థించింది:

"తీర్మానం ఆమోదించి అప్పటికే మూడు నెలలపైగా అయింది. మనము వెంటనే కేంద్ర ప్రభుత్వానికి వ్రాయకపోయినట్టయితే - ప్రత్యేక ఉద్యోగి నియామకం; రికార్డులు, లైబ్రరీ మొదలైన వాటిని విభజించే కార్యక్రమం ఆరంభం కాకుంటే, జూలై మొదటి వారంలో హైకోర్టు స్థాపించడం కష్టము. అది జరగక పోయినట్టయితే, ఇంత ప్రయత్నంచేసిన మనను చూసి నలుగురు నవ్వుతారు."

ప్రకాశంగారు ముఖ్య కార్యదర్శిని పిలిచి, ఒక రాత్రి కాబినెట్ మీటింగ్ ఏర్పరచారు. ఆ సమయంలో, ఇదివరకు రెండు, మూడు పర్యాయాలు జరిగినట్టే అందరు మంత్రులూ నిశ్శబ్దంగా కూచున్నారు.