పుట:Naajeevitayatrat021599mbp.pdf/853

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చూసి, "ఏమి పాయ్‌గారూ! మీకూ ఈ విషయం తోచలేదా?" అని ప్రశ్నించారాయన.

పాయ్‌గారు తమకూ తోచలేదన్నారు.

దానిపైన, కొంత ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకున్నాము. అందులో, ఆంధ్రరాష్ట్రం వేరే హైకోర్టు పెట్టుకోవడం ఉత్తమమని తేలింది.

కర్నూలుకు తిరిగి వచ్చిన తర్వాత ప్రకాశంగారి కీ విషయమంతా చెప్పాను. ఇంతేకాక, చెన్నపట్నంలో వృత్తి నడుపుకొంటున్న తెలుగు న్యాయవాదులకు కూడా పరిస్థితులన్నీ వివరంగా బోధపరచి, మన హైకోర్టు మనకు వేరే ఉండడమే శ్రేయస్కరమని నచ్చజెప్పాను.

అందుచేత, ఆంధ్రరాష్ట్రం ఏర్పడేటప్పుడు అనంగీకారము సూచించినవారు, మనకు ప్రత్యేకంగా ఉన్నత న్యాయస్థాన స్థాపనకు సుముఖత చూపించారు. దీనివల్ల దాదాపు 200 మందికి పైగా ఆంధ్ర న్యాయవాదులు శాశ్వతంగా చెన్నపట్నంలో ఇళ్ళు, వాకిళ్ళు, తక్కిన సంబంధాలు అన్నీ వదులుకుని పోవలసి వస్తుంది.

అయినా వారూ, నేను కూడా విశాలాంధ్ర వచ్చేవరకు తాత్కాలికంగా హైకోర్టు విశాఖపట్నంలో ఉంటే బాగుంటుందను కున్నాము.

ప్రకాశంగారు ఈ విషయమై శాసన సభలో ప్రతిపాదించారు. 22-6-1954 న ఆంధ్రా హైకోర్టు స్థాపించాలనీ, దానికి విశాఖపట్నం కేంద్రమనీ తీర్మానం ప్రతిపాదించారు.

విశాఖపట్నం విషయంలో - నా సంబంధంగా ఏది వచ్చినా, కాదనడానికి విశాఖపట్నం జిల్లానుంచి వచ్చిన ఒకరిద్దరు శాసన సభ్యులుండేవారు. వారి సాయంతో నడింపల్లి నరసింహారావుగారు విశాఖ పట్నం అనే మాటముందు తాత్కాలికంగా అన్నమాట సవరణ చేశారు. నా మనసులో ఉన్నది కూడా అంతేకాబట్టి, వెంటనే లేచి ఆ సవరణ ఒప్పుకున్నాను.

తిరిగి 1-3-54 న, విశాఖపట్నం అనే మాటకు బదులు గుంటూరు అన్నమాట చేర్చవలసిందని సవరణ ప్రతిపాదించారు.