పుట:Naajeevitayatrat021599mbp.pdf/852

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కారం (జ్యూరిస్డిక్షన్) అప్పజెప్పే ఏర్పాటు చేసుకోవచ్చునని ఉంది. ఆ కారణంచేతనే, ఆంధ్రరాష్ట్ర మేర్పడినప్పుడు, వేరే హైకోర్టు ఏర్పాటు చేసుకోకుండా, మద్రాసు హైకోర్టుకే మన రాష్ట్రంపై క్షేత్రాధికారం ఇవ్వడం జరిగింది.

ఇటువంటి పరిస్థితులలో, హైకోర్టు జడ్జీలను నియమించే సమయంలో, క్షేత్రాధికారం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వపు ఉద్దేశాలను గూడా గమనించవలసిందని, "వాంఛూ" అనే చీఫ్ జస్టిసుగారు వ్రాసిన నివేదిక కాపీ చెన్నరాష్ట్ర ప్రభుత్వందగ్గర ఉంది.

కాని, ఆంధ్ర ప్రభుత్వంతో ప్రమేయం లేకుండానే మద్రాసు హైకోర్టుకు జడ్జీలను నియమించడం జరిగింది. ఇది ఆంధ్ర రాష్ట్ర మేర్పడిన మూడు నెలలలోగానే జరిగింది.

నేను, ప్రకాశంగారితో చెప్పి, ఈ విషయంలో చెన్నరాష్ట్ర ముఖ్యమంత్రి రాజాజీని కలుసుకొని మాట్లాడడానికి వెళ్ళాను. ఆయన చాలా ఆప్యాయంగా మాట్లాడారు.

కాని, తమ హైకోర్టు జడ్జీల నియామకంలో బాధ్యత - పరాయి ప్రభుత్వంతో పంచుకోవడం ఎల్లా? అని ప్రశ్నించి, అటుపై జరిగే జడ్జీల నియామకంలో కూడా ఆంధ్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదన్నట్టు మాట్లాడారు.

దానిపై, నేను ఢిల్లీ వెళ్ళి, కేంద్ర హోమ్ మంత్రి కట్జూ గారిని చూశాను. ఆయనతో నాకు చాలా కాలంగా పరిచయముంది. 1928 లో లక్నోలో అఖిల పక్ష సమావేశంలో నెహ్రూగారి రిపోర్టును చర్చిస్తున్నపుడు, ఆయన - నేను నెహ్రూగారి బలపరచినప్పటినుంచి మా యిద్దరికీ బాగా పరిచయముండేది.

ఆయనను నే నిలా అడిగాను: "మద్రాసు హైకోర్టు జడ్జీలను నియమించినపుడు, ఆంధ్ర ప్రభుత్వాన్ని సలహా అడగాలని మీ కెందుకు తోచలేదు?"

"నిజమే. అడగవలసిందే కానీ, నాకు తోచలేదు" అని, ఆ సమయంలో దగ్గరగా ఉన్న హోమ్‌శాఖ కార్యదర్శి ఎ.వి. పాయ్‌గారిని