పుట:Naajeevitayatrat021599mbp.pdf/850

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయితే, ఆయన నా కేమి అర్థం కాదన్న ఉద్దేశంతో, "రిజర్వాయరు డామ్ 425 అడుగుల ఎత్తువరకే నిర్మించడానికి నువ్వు ఒప్పుకుంటే, వెంటనే ఈ స్కీము శాంక్షన్ చేస్తా"నన్నారు.

అందుకు నేను ఒప్పుకోనన్న ఉద్దేశంతో ఆయన అలా అన్నారు. నేను వెంటనే, "సరే, ఒప్పుకొంటున్నాను లెండి" అన్నాను.

అందుకు కారణ ముంది. 425 అడుగులు కట్టకట్టితే, కాలువలలోకి ఒక నీటిచుక్క అయినా మళ్ళించలేము. కట్ట అ ఎత్తున ఆపినట్టయితే ఆ స్కీము ఉట్టి దండగపని అవుతుంది. 425 అడుగులకు ఒప్పుకున్న తర్వాత, అంతవరకు చేసిన ఆ ఖర్చు పనికి రావడంకోసం మరొక 100 అడుగుల ఎత్తు కట్టకుండా ఏ ప్రభుత్వమూ పని ఆపదు గదా అనే ఉద్దేశంతో నేను సరేనన్నాను.

ఆయన అంతవరకు ఒప్పుకుంటే, మిగిలిన పని నెహ్రూగారితో చెప్పి సర్దుబాటు చేసుకోగలనని నా మనసులో ఉన్న విశ్వాసాన్ని గ్రహించక, కృష్ణమాచారిగారు, "నువ్వు ఒప్పుకుంటే, బొంబాయి గవర్నమెంటువారు ఒప్పుకోరు - నన్నేం చేయమంటావు?" అన్నారు.

ఆయన చెప్పిన మొదటి మాట ఎంత పేచీ మాటో - రెండవదీ అంతే పేచీ మాట.

నేను నెహ్రూగారి దగ్గరికి వెళ్ళి, స్కీము డిజైన్లు చూపించి, ఉన్న పరిస్థితి బోధపరిచాను.

ఆయన కది నచ్చినట్లే తోచింది. కానీ ఆయన వెంటనే "ఇది నాకు నచ్చితే ఏమి ప్రయోజనము? కృష్ణమాచారిగారు ఒప్పుకోవాలి గదా!" అన్నారు.

సరిలే! ఇది ఢిల్లీ ప్రభుత్వం పద్ధతి అనుకొని, ప్లానింగ్ కమీషన్ సభ్యులూ, ఆర్థికమంత్రీ అయిన దేశ్‌ముఖ్‌గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన వెంటనే, కృష్ణమాచారిగారు పెట్టిన అభ్యంతరం డబ్బుతోకానీ, సాంకేతికమైన విషయంతోకాని సంబంధంలేని మరొక విషయమని సూక్ష్మం గ్రహించి, ప్లానింగ్ కమీషనులో మరొక సభ్యులైన యోగి గారిని చూడమని నాతో చెప్పి, ఆయనకు టెలిఫోన్ చేశారు.