పుట:Naajeevitayatrat021599mbp.pdf/846

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రప్రాంతంలో గల నీటిపారుదల ప్రాజెక్టులపై ఉమ్మడి ప్రభుత్వం దృష్టి ఆ విధంగా చులకనగా ఉండేది.

ఆంధ్రప్రభుత్వం ఏర్పడిన వెంటనే జిల్లాలలో గల శాసన సభ్యులనే గాక, ఇతర మిత్రులను కూడా పిలిచి 17 మధ్య తరగతి ప్రాజెక్టులు (మరీ హెచ్చుగా ఖర్చు కానివి) శాంక్షను చేయడము, [వీటిలో నాగావళి, వేగవతి, స్వర్ణముఖి (శ్రీకాకుళం జిల్లా), స్వర్ణముఖి (కాళహస్తి దగ్గర), గంభీరము గెడ్డ, పాలేరు, నగిలేరు, పెన్నారు, ఏలేరు నదులపై కట్టవలసినవి ఉన్నాయి.] అప్పటి లెక్కలలో 6 1/2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అదనంగా లక్షా యాభై వేల ఎకరాల భూమి సాగులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు జరిగాయి.

ఇదికాక, పులిచింతల ప్రాజెక్టు వదులుకొని, హైదరాబాదు ప్రభుత్వంతో కలిసి, పులిచింతలకు ఎగువగా నందికొండవద్ద మొత్తంపైన 30 లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చే స్కీము, జాయంటు నివేదిక తయారుచేసి, ఆంధ్రప్రభుత్వం తరపున నేను, సంజీవరెడ్డిగారు, హైదరాబాదు ప్రభుత్వం తరపున డాక్టర్ మేల్కోటే (మంత్రి) ముగ్గురమూ స్వయంగా వెళ్ళి, కేంద్ర నీటిపారుదల మంత్రి అయిన నందాగారికి అందజేశాము.

ఈ స్కీము విషయమై వేరే తిరిగి వ్రాస్తాను.

20

ప్రకాశం బారేజ్

మనము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమయంలోనే, విజయవాడ దగ్గర - కృష్ణా ఆనకట్ట కుడిఒడ్డుకు కొంచెం దగ్గరగా కొంత భాగం అకస్మాత్తుగా జారిపోయింది. అప్పటికే ఆ అనకట్ట కట్టి వంద ఏండ్లకుపైగా అయింది. దాని క్రింద 11 లక్షల ఎకరాల వరిపంట ఉంది.

భారత దేశంలోని ప్రాజెక్టులలో ఇది ఒక పెద్ద ప్రాజెక్టు.

ఆనకట్టకు దెబ్బతగిలినదని సగము రాత్రివేళ తెలిసి, అక్కడ