పుట:Naajeevitayatrat021599mbp.pdf/843

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమ ఆంధ్రశాసనసభ..

823

మర్నాడు కలుసుకొనేసరికి, ఏడుగురు మంత్రులు ఏకీభావంలోకి వచ్చారు.

ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కూడా - సంతృప్తి, అసంతృప్తుల మద్య డోలాయమాన మానసుడై, ఆ ఖైదీలలో కేంద్ర ప్రభుత్వ ఖైదీలుగా ఉన్న కొందరిని కేంద్రం అనుమతిలేక విడిచిపెట్టే వీలులే దన్న అభ్యంతరం సూచించాడు.

ఆ మద్య కాలంలోనే, నేను ఒకమారు జంకుతూ, "తుదినిర్ణయం తీసుకొనేముందు ప్రధాన మంత్రితో మీరు ఒకమారు ఈ విషయాలు మాట్లాడితే బాగుంటుందేమో!" అన్నాను ప్రకాశంగారితో.

అందుకు ఆయన వెంటనే, "ఇది మన బాధ్యత. మరొకరి సలహా తీసుకొనే పరిస్థితి వస్తే, ముందుగా రాజీనామా యిచ్చేయడం మంచిది," అన్నారు.

ఆ మాటతో, నేను సంవిధాన సూక్ష్మతను గ్రహించి, నేను చెప్పిన మాటలు మరెవరూ వినకుండా నేనే ముందడుగు వేయడం మంచిదని ప్రధాన కార్యదర్శితో, "ఆంధ్రరాష్ట్ర అవతరణ సందర్భంగా ప్రభుత్వంవారు కారాగారావాసు లందరినీ విడుదల చేయడానికి నిశ్చయించారు - అని తీర్మానం వ్రాయండి" అన్నాను.

రాజకీయాలతో ప్రసక్తి లేకుండా అ విధంగా, దేశ చరిత్రలో ఎన్నడూ జరగని మోస్తరుగా, సర్వ కారాగృహవాసులకు విముక్తి కలిగించాము.

ఆ క్షణాన కోర్టులలో విచారింపబడుతున్న వారిని కూడా విముక్తులను చేయడం జరిగింది.

ఆ తరువాత 48 గంటలకు కారాగృహ శిక్ష పొందిన ఖైదీలెవ్వరూ ఆంధ్రరాష్ట్ర కారాగారాలలో లేరు.

అయితే, తల్చుకుంటే ఇప్పటికీ గుండె దడదడలాడే ఒక దుస్సంఘటన జరిగింది.

కాబినెట్‌లో మేము చేసిన తీర్మానం తంతి వార్తలద్వారా అన్ని జైళ్ళకు పంపిఉంటే ఆ దురంతం జరిగిఉండేది కాదు.