పుట:Naajeevitayatrat021599mbp.pdf/841

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకాశంగారి ఈ మాటలను బట్టి పాఠకులకు నాటి కర్నూలు ప్రభుత్వ మే స్థితిలో ఉందో తెలుస్తుంది.

అయినప్పటికీ, ఉన్న 13 నెలలలోనూ, ఐదారేండ్లు ఉంటేగానీ ఏ ప్రభుత్వమూ చేయలేని పనులు చేయగలిగారు.

మధ్యకాలంలో సంజీవరెడ్డిగారికీ, వారికీ మధ్య మనస్పర్థలు పెరిగినా ప్రభుత్వపు చురుకుదనం మందగించలేదు.

తమ ప్రభుత్వ కాలంలో - 13, 14 నీటిపారుదల ప్రాజెక్టులు స్థాపించారు; శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని సంస్థాపించారు; ఆంధ్ర హైకోర్టు (ఉన్నత న్యాయస్థానము) నెలకొల్పారు; తిరుపతి దేవస్థానం నిర్వహణకు కావలసిన మార్పులు శాసన రూపంలో చేశారు.

ఖైదీలందరికీ విముక్తి

ఆంధ్ర ప్రభుత్వం ఏర్పాటయిన కొద్ది కాలంలోనే, కమ్యూనిస్టు పార్టీ సభ్యులనుంచి - తమ పార్టీకి చెందిన ఖైదీలను, డెటిన్యూలను విడుదల చేయవలసిందని అర్జీలు శరపరంపరగా రాసాగాయి. అందుచేత, ఆ విషయం కాబినెట్‌లో చర్చించవలసిన అగత్యం కలిగింది.

ఉద్యోగులు _ ఈ అర్జీలను పరిశీలించి, రాజకీయ కారణాలవల్ల జైలులో ఉన్న కమ్యూనిస్టుపార్టీ ఖైదీలను, డెటిన్యూలను రెండు శాఖలక్రింద విభజించారు. ఒక శాఖలో అపాయకారులని కొందరినీ, రెండవ దానిలో అంత అపాయకారులు కారన్న వారినీ పేర్కొన్నారు. అయితే అనపాయకారు లని వారు సూచించిన కొందరిపై హత్యా నేరాలు ఆరోపింపబడి ఉండెను.

వారు వచ్చిన జిల్లాలలో నుంచే మంత్రివర్గంలో ఒక మంత్రి కూడా ఉండేవరు. ఆయన - వారు చాలా అపాయకారులు గనుక, వారిని వదలడానికి వీలులేదని వాదించారు.

మరొక మంత్రి, "హత్యచేసిన వారినే అనపాయకారులుగా ఉద్యోగులు భావించగా, మిగిలిన వారిని ఖైదులో ఎందుకు ఉంచాలి?" అని వాదించారు.

మరొకరు, "సాధారణ హత్యలకన్నా రాజకీయ హత్యలు సంఘ విద్రోహకరమైనవి గనుక, వారిని అసలే విడిచి పెట్టకూడదు" అన్నారు.