పుట:Naajeevitayatrat021599mbp.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోర్టులో చాలా దావాలు వుండేవి. రంగమన్నారు కాలంలో అతను నాకు క్లయింటు అయ్యాడు. అప్పటికి ఆయనకీ దుర్గయ్యగారికీ ఏవో అంతశ్శీతలాలు బయలుదేరాయి. బయలుదేరడంలో ఆశ్చర్యం ఏమీ లేదు! ఛైర్మన్ పదవికి సహాయం చేశారు కనక, పరిపాలనలో కొంచెం లోతుగా జోక్యం చేసుకునేవాడు. దుర్గయ్యగారి వంటి స్వతంత్రుడు దానికి అంగీకరించకపోతే సహజంగా తగాదా వచ్చేది. కనక, ఆ రాయపూడి సుబ్బారాయుడి దృష్టి నామీద పడింది. అప్పట్లో నాకు ఎల్లాగైనా బి.ఏ. పూర్తిచేసి ఫస్టుగ్రేడు పాసుకావాలని వుండేది. హనుమంతరావు నాయుడిగారి సలహాపైని బి.ఏ. పార్టుగా పాసు కావడానికి సంకల్పించుకుని ముందు తెలుగుకి హాజరై పాసయ్యాను. కాని , ఈ మునిసిపల్ వ్యవహారాల్లో పడి ఆ చదువుకి స్వస్తి చెప్పవలసివచ్చింది.

ఆ కాలంలో మునిసిపాలిటీకి ప్రతి సంవత్సరంమూ ఎన్నికలు జరుగుతూ వుండేవి. ఖాళీ అయిన ప్రతిస్థానంలోనూ మనుష్యుల్ని కూర్చుకుని ఛైర్మన్ ఎన్నిక వచ్చేసరికి బలాబలాలు తేల్చుకుంటూ వుండేవాళ్ళు. సుబ్బారాయుడు ప్రభృతుల ప్రోత్సాహం మీద నేను ఎన్నికలకి నిలిచినప్పుడు దుర్గయ్యగారు నన్ను రాకుండా చెయ్యడానికి ప్రయత్నించేవారు. నేను అతి శ్రమపడి అన్ని ఏర్పాట్లూ చేసుకునేసరికి, ఆఖరురోజు రాత్రి ఆయన తన ఛైర్మన్ పలుకుబడి అంతా ఉపయోగించి వోటర్లని తిప్పివేసేవాడు. నేను మొట్టమొదట ఏ వార్డుకి నిలబడ్డానో జ్ఞాపకం లేదు కాని 1896లో ఎన్నికలకి నిలబడినట్లు గుర్తు. కాని, అప్పుడు ఓడిపోయాను.

మళ్ళీ 97, 98 సంవత్సరాల్లో బై ఎలక్షన్లలో అభ్యర్థిగా వున్నాను. దుర్గయ్య గారు మొత్తం మూడుసార్లూ కూడా నన్ను ఓడించారు. నేను ఏవో ఎన్నికల పిటీషన్లు వగైరాలు పెడుతూ వుండేవాణ్ణి. వాటిని అన్నిటినీ దుర్గయ్యగారు ఎదురుకుంటూ వుండేవారు. దుర్గయ్యగారు మొత్తం మీద చాలా ప్రతిభావంతులు. మేథావులు, సరస్వతంత్రులు. నైతికోన్నతీ, పరిపాలనాశక్తీ, ధైర్యస్థైర్యాలు వున్నవారు. మరి ఒకరు అయితే సుబ్బారావు పంతులుగారి ఎత్తుల్లో పడి పల్టీలు కొట్టవల