పుట:Naajeevitayatrat021599mbp.pdf/836

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మైన విషయము. వారికి ప్రత్యేకంగా మన కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను."

ప్రతిపక్షులు పట్టుదల కలవారు. వెంటనే, కృతజ్ఞతా తీర్మానానికి - గుంటూరు, విజయవాడల మధ్య తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేయనందుకు తమ విచారాన్ని వెలిబుచ్చుతూ ఒక సవరణ ప్రతిపాదించారు. ఈ సవరణ న్యాయంగా చర్చకు తేవడానికి వీలులేదు. అది ప్రభుత్వం చేసిన ఏర్పాటు కాదు. ఆంధ్ర శాసన సభ్యులందరు బహుమతంతో చేసిన నిర్ణయము.

అయితే నేమి? స్పీకరుగారు సందిగ్ధమైన మనస్తత్వంగల మనిషి కావడంచేత, ఆ సవరణను చర్చించడానికి అనుమతించారు.

చర్చ ప్రారంభ దశలో, సభ్యుల మనసులలో విషయం తేటగా ఉండడానికని, ప్రకాశంగారు లేచి మాట్లాడారు. దాని సారాంశమిది:

"కర్నూలు పట్నం శాశ్వత రాజధాని కాదు. ఇది తాత్కాలికమయినదని చెన్నపట్నంలో ఆంధ్ర శాసన సభ్యులు కలిసి చేసిన తీర్మానంలో ప్రత్యేకంగా వ్రాసిఉన్నది. అందుచేత, మనమంతా సావకాశంగా ఆలోచించుకొని 'శాశ్వతమైన' రాజదానిని యిటుపైని ఏర్పాటు చేసుకోవాలని దాని అర్థము. ఇది నిస్సందేహమయిన పరిస్థితి. ఇంతేగాక, త్వరలోనే భారత దేశంలోగల రాష్ట్రాలను భాషారాష్ట్రాలుగా పునర్విభజన చేస్తామని భారతప్రధాని మాట యివ్వడమేగాకుండా, దానికి సంబంధించి ఉన్నతాధికారమున్న పరిశీలనా సంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ప్రకటన చేశారు. త్వరలో విశాలాంధ్ర ఏర్పడగలనన్న విశ్వాసము నాకున్నది. అప్పుడు హైదరాబాదు మనకు శాశ్వత రాజధాని కాగలదు. అది జరగడానికి రెండు మూడేండ్లకన్నా ఎక్కువ కాలము పట్టదు. ఈలోపున బాగా వెనకబడ్డ కర్నూలు కొంచెం బాగుపడడానికి చేసిన యీ ప్రయత్నాన్ని మీరంతా ఎందుకు అడ్డుతారు? ఇదికూడా మన ఆంధ్రప్రాంతమే కదా? కనుక, కోపతాపములు లేకుండా చర్చ సాగనివ్వండి."