పుట:Naajeevitayatrat021599mbp.pdf/829

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పై చెప్పిన ఏర్పాట్లను చురుకుగాను, సవ్యంగాను జరిపించే బాధ్యత మా సంఘంపైనే పడింది.

ప్రభుత్వంవారు ఆర్డర్లు పాస్ చేయడం తప్ప, ఎక్కువ ప్రమేయం కల్పించుకోలేదు.

ఇలాఉండగా, పోర్టు సెంటుజార్జిలో బల్లల విషయమై, రికార్డుల విషయమై, పుస్తకాల విషయమై, గుమస్తాలకు గుమస్తాలకూ మధ్య చాలా తగాదాలు వస్తున్నాయనీ, మంచిబల్లలు వారుంచుకొని, విరిగిన బల్లలు, కుర్చీలు ఆంధ్రరాష్ట్రాని కిస్తున్నారనీ, పుస్తకాలు రెండేసి కాపీలు ఉన్న ఒక కాపీ అయినా అందనీయకుండా ఉన్నారనీ అరగంట కొకసారి మా ఉప సంఘానికి ఫిర్యాదులు వస్తూండేవి.

జ్ఞాతులు ఆస్తులు పంచుకొనేటప్పుడు, పై చేయిగలవారు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ విధంగా తెలుగు ఉద్యోగులయెడల తమిళ ఉద్యోగులు వ్యవహరిస్తున్నారని వచ్చి మాకు చెపుతూండేవారు.

ప్రభుత్వంలో పెద్ద ఉద్యోగంలో ఉన్న పుల్లారెడ్డిగారు, క్రొత్త రాష్ట్రంలోకి వెళ్ళిపోతున్నారనే వార్త ఎప్పుడైతే రూఢి అయిందో, అప్పటినుంచి తమిళ ఉద్యోగులు ఆయన మాటకూడా అట్టే పాటించేవారు కారు.

కేవలం తెలుగు జిల్లాలకు సంబంధించిన రికార్డులేవైనా ఉంటే వాటి అసలు కాపీలే తెలుగు రాష్ట్రానికి ఇచ్చి వేయవలసిందనీ, తెలుగు తమిళ రాష్ట్రాలు రెంటికీ సంబంధించిన కాగితాలుంటే అసలు వారు ఉంచుకొని, వాటికి నకళ్లు వ్రాసి మన కివ్వాలనీ సూత్రీకరించాము.

ఆ విధంగా పని జరగడం ప్రారంభమయినా, ఇప్పుడు ప్రకాశంగారి జీవితచరిత్ర వ్రాసే సందర్భంలో, అనేక రికార్డులు కావాలని మన ప్రభుత్వాన్ని అడిగితే, వారు వెతికించగా, అవి చెన్నపట్నం నుంచి నేటివరకు రాలేదని తేలింది. అందుచేతనే, నేను వ్రాసిన విషయాలకు సంబంధించిన గవర్నమెంటు ఆదేశాల సంఖ్యలుగాని, తేదీలు గాని యివ్వకుండా వాటిలోని విషయాలు మాత్రం సూచింపగలుగుతున్నాను.