పుట:Naajeevitayatrat021599mbp.pdf/824

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాడలో ప్రతిపక్షులకు గల స్థానబలము, అంగబలములకు తోడు, అక్కడి ప్రజల సహజ స్వనగరాభిమానము కూడా తోడై, రాజకీయమైన ఉష్ణతను అత్యుగ్రతకు తీసుకువెళ్లాయి.

రాత్రి అయ్యేసరికి, ప్రకాశంగారికి విజయవాడ అభిమానులవద్దనుంచి ట్రంక్‌కాల్స్, తంతి వార్తలు రాసాగాయి.

తీర్మానం మార్చకపోతే, ప్రకాశంగారి కంచు విగ్రహం ప్రజలు బద్దలు కొట్టేస్తారనే భయం కలుగుతున్నదని కూడా ఆ వార్తలలో చెప్పారు.

ప్రకాశంగారు, "ఆ కంచు విగ్రహం పెట్టవలసిందని నే నెవరి నైనా కోరానా? దాన్ని పెట్టిన ప్రజలకు, దాన్ని బద్దలు కొట్టుకొనే హక్కు తప్పకుండా ఉంటుంది కదా?" అన్నాడు.

ప్రకాశంగారి నిర్లిప్తత బెజవాడలో ప్రజల ఆవేశాన్ని పూర్తిగా తగ్గించివేసింది.

కర్నూలు పేరు ఆయన చెప్పడానికి కారణ మిది: "విశాలాంధ్ర రాష్త్రం త్వరలో ఏర్పడడానికి అవకాశముంది. భాషారాష్ట్రాల ఏర్పాటు విషయమై, నెహ్రూగారు ఒక ఉపసంఘం వేశారు. అందుచేత, త్వరలో - విశాలాంధ్రరాష్ట్రం రావడము తప్పదు. అప్పుడు హైదరాబాదు మన రాజధానికాక తప్పదు.

"కర్నూలు, హైదరాబాదుకు వెళ్ళే త్రోవలో ఉంది. మరొక కారణమూ ఉంది. ఒకటి రెండు సంవత్సరాలు తాత్కాలికంగా రాజధాని అక్కడ ఉండినట్లయితే, రాయలసీమ జిల్లా కేంద్రాలన్నిటిలోను చాలా వెనకబడ్డది కావడంచేత, రాజధాని ఉన్న రెండు, మూడు ఏండ్లయినా, అది అభివృద్ధి పొందడానికి వీలు కల్పించిన వాళ్ళ మవుతాము."

కర్నూలు తాత్కాలికంగా రాజధాని అనడంలో హైదరాబాదు మనకు వచ్చినా, రాకపోయినా, మన మన్ని పరిస్థితులను సావకాశంగా ఆలోచించి, శాశ్వతమైన రాజధానిని ఏర్పరచుకోవాలన్న భావం ఇమిడి ఉంది.