పుట:Naajeevitayatrat021599mbp.pdf/816

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పడమో చేసుకోవాలని వారు వాదించి, పార్టీ ప్రతి సమావేశంలోను ఏదో ఒక తగాదా లేవదీస్తూండేవారు. ఆ తగాదా లేవదీసిన నాయకుడే ఆ తర్వాత కాంగ్రెసుతో కలిసి, మంత్రికావడం ఒకేక్షణంలో జరిగిందని యిదివరలో సూచించాను. అందుచేత ఆంధ్రరాష్ట్ర సమస్యపై పార్టీలో ప్రకాశంగారి అభిప్రాయాలే బహుమతస్వీకారమై ఆంధ్ర హృదయాన్ని ప్రతిబింబిస్తున్నా, పార్టీనుంచి ఏక కంఠమైన మాట రాకపోవడంవల్ల దాని ప్రతిష్ఠ తగ్గడమేగాక, చివరికి అది రెండు ముక్కలుగా చీలిపోవడంకూడా జరిగింది.

అ రోజులలో గోపాలరెడ్డి, కళా వెంకటరావుగారల వర్గం - ప్రకాశంగారు, ఆంధ్రప్రజలు పెట్టుకొన్న ప్రత్యేక ఆంధ్రరాష్త్రస్థాపన లక్ష్యాన్ని అంతగా ఆమోదించే స్థితిలో లేరు. 1952 ఎన్నికలలో వారు ఓటమి చెందినా, అంతకుముందు మంత్రులుగా ఉన్నపుడు - రాష్ట్రవిభజన కమిటీలో, చెన్నపట్నం తమిళరాష్ట్రానికి చెందుతుందన్న సూత్రానికి, వారు స్వహస్తాలతో ఆమోదముద్ర వేశారు.

మా పార్టీలో కలిసిఉన్న సోషలిస్టుల వైఖరి పైన సూచించాను. ఈ విషయంలో, యునైటెడ్ ఫ్రంటులో భాగస్వాములుగా మాతో కలిసి పనిచేస్తున్న కమ్యూనిస్టుల వైఖరికూడా, సోషలిస్టుల వైఖరి ఉన్నట్టే ఉండేది.

ప్రజాసామాన్యం మనసులో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములుగారి ప్రాయోపవేశానంతరము, ఏదో ఒక విధంగా ఆంధ్ర రాష్ట్రమంటూ ఒకటి ప్రత్యేకంగా దేశపటంలో తన రూపం కనిపించేటట్టు ఏర్పడాలనే ఆందోళనా భావం ఉండేది. ప్రకాశంగారు ఇదంతా కనిపెట్టి, నీలం సంజీవరెడ్డి, గోపాలరెడ్డి, కళా వెంకటరావుగారల వర్గంవారే అయినప్పటికీ, తమ అభిప్రాయాలతో కొంచెం అనుకూలంగా కనిపించేటట్టు ఏదో బహిరంగ సభలో మాట్లాడినట్టు పత్రికలో చూసి, ఆయన తమతో ఒకసారి వచ్చి మాట్లాడవలసిందని కబురుపెట్టారు.

ఇది - ఆ సంవత్సరం ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికై పెట్టిన మొదటి అడుగు.