పుట:Naajeevitayatrat021599mbp.pdf/813

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరాములుగారి నిర్దుష్టమయిన ఉపవాస దీక్ష రోజురోజుకూ, ఆంధ్రుల హృదయాలలో ఆందోళన కలిగించ సాగింది. ప్రజల భావాలలో ఒక వేడిని పుట్టించింది. ప్రకృతి అనుకోనటువంటి ఉష్ణతను ధరించింది. కార్మికులలోను, విద్యార్థులలోను - ఆంధ్రరాష్ట్రవిషయమై గాక, శ్రీరాములుగారి ప్రాణవిషయమై చాలా మనస్తాపం కలిగింది.

ముఖ్యమంత్రిగారు మాత్రం, శాసన సభలో ఈ ప్రసక్తివస్తే చులకనగాను, తేలికగాను మాట్లాడేవారు. ఉపవాసం ఆరంభమయిన యాభై రోజులకు, పట్నంలో గల వాతావరణాన్ని తపింప జేసింది. ఋషులు తీవ్రమైన తపస్సు చేస్తే, భూమి గజగజలాడుతుందని పురాణాలలో చదువుకోవడమే గాని, అంతకుముందు మాలో ఎవరికీ అనుభవం లేదు. కాని, అప్పుడు 50 వ రోజు దాటి 51 వ రోజు, 51 వ రోజు దాటి 52 వ రోజు - ఈ విధంగా ఉపవాస దీక్ష జరిగేసరికి చెన్ననగర రాజవీథులన్నీ గజగజలాడుతున్నట్టు అనిపించేది.

నెహ్రూగారు ఏమీ మాట్లాడలేదు. ఆందోళనా ఫలితంగా ఏ నిర్ణయమూ తీసుకోకూడదని సచివాలయపు ఐ.సి.ఎస్. ఉద్యోగులు కరడుగట్టిన మనసులతో చెప్పిన సలహా వాక్యాలు, ఆయనకు వేద వాక్యాలయ్యాయి.

దినములు, క్షణములు, గడచిన కొద్దీ సామాన్య ప్రజానీకం సాంబమూర్తిగారి యిల్లున్న వీథిలో నిండిపోయేవారు. ఆయన యిల్లు చాలా చిన్నది.

యాభై ఆరవ దినము సగము రాత్రివేళ సమస్య పరిష్కారమవుతుందని, అందుచేత శ్రీరాములుగారు ఉపవాస దీక్ష విరమించవలసిందని రాధాకృష్ణగారు ట్రంకాల్‌ద్వారా చెప్పినట్టు, శ్రీరాములు గారికి ఎవరో మెల్లిగా చెప్పారు.

ఆయన చిన్న కంఠంతో

"ఈ వార్త జవహరులాలుగారు అన్నరా? లేక రాధాకృష్ణగారు తమంతట తామే ఈ ఆశను వెలిబుచ్చారా?" అనే అర్థంతో అడిగారు.

అది రాధాకృష్ణగారు తమ మాటగానే చెప్పినట్టు, టెలిఫోను