పుట:Naajeevitayatrat021599mbp.pdf/812

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగు భూమిపైన, తెలుగు నాయకుడు కౌలుకు ఇచ్చిన పట్టాను బట్టి కట్టిన పోర్టు సెంటు జార్జి, దానికి ఉత్తరంగా ఉన్న పట్నం తెలుగు ప్రాంతంలో చేరునా, చేరదా అనే సందిగ్ధ స్థితి ఏర్పడింది.

ఈ ఆలస్యము, ఈ సందిగ్ధావస్థా గాంధీగారి ఆశ్రమంలో శిక్షణ పొందిన పొట్టి శ్రీరాములుగారి కేమి నచ్చలేదు. ఆయనసహాయ నిరాకరణోద్యమంలో (నాన్ కో - ఆపరేషన్) ప్రారంభ దశలోనే పాల్గొన్నవారు. పట్టుదలకు ఆయన పెట్టినది పేరు.

చెన్నపట్నంతో కలిపి ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేయకపోతే, నిరాహార దీక్ష తీసుకొంటానని - ఆయన చెన్నరాష్ట్ర ప్రభుత్వానికీ, జవహర్‌లాల్ నెహ్రూగారికి హెచ్చరికలు (నోటీసులు) అందజేశారు. కాని, వారు శ్రీరాములుగారినిగానీ, ఆయన చెప్పిన విషయాన్నిగానీ తమ దృష్టికి తెచ్చుకోలేదు.

శ్రీరాములుగారు మాత్రం, తాము సూచించినట్టు ఫోర్టు సెంటు జార్జి గుమ్మంవద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. బులుసు సాంబమూర్తిగారు, ప్రకాశంగారు నిరాహార దీక్షకు కోటగుమ్మం తగినస్థలం కాదని, మైలాపూరులో సాంబమూర్తిగారు నివసిస్తున్న వసతి గృహానికి ఆయనను తీసుకు వెళ్ళారు. ఇది అక్టోబరు నెల మూడవ వారంలో ఆరంభ మయింది.

మొదటి రోజులలో పట్నంలోని ప్రజలు దీన్ని అంతగా పట్టించుకోలేదు. శాసన సభలో ఎవరో ఈ ప్రసక్తి తెచ్చినపుడు, ముఖ్యమంత్రి రాజాజీ చులకనగా మాట్లాడారు. కాని, రానురాను - పట్నంలోను, శాసన సభ్యుల మనసులలోను, తెలుగు జిల్లా లన్నిటిలోను, శ్రీరాములుగా రే మవుతా'రన్న ఆందోళన ఉదయించింది.

ఉపరాష్ట్రపతి అయిన రాధాకృష్ణగారు ప్రమేయం కలిగించుకోవాలని చెన్నపట్నంనుంచి శాసన సభ్యులు, పెద్దలు ఆయనకు తంతివార్తలు ఇవ్వడం ఆరంభమయింది. కాని, ఆయనకు నెహ్రూగారి మనసును త్రిప్పే శక్తి ఉన్నట్టుకనిపించలేదు. మాకు జవాబుగా అనునయ వాక్యాలు మాత్రం టెలిఫోనులో చెపుతూ ఉండేవారు.