పుట:Naajeevitayatrat021599mbp.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహేంద్రవరం అంతటినీ కలవరపరుస్తూ వున్న మునిసిపల్ వ్యవహారాల్లో పడ్డాను. ఒక కేసులో ముద్దాయి తరఫున నేను, ఫిర్యాది తరఫున ఆయన హాజరయ్యాము. కేసు తాడినాడ వెంకట్రామయ్య అనే మేజస్ట్రీటు దగ్గర. ఆయన వింతపద్ధతి అవలంబించి, వకీలుగా ఉన్ననన్ను సాక్షిగా పిలిపించాడు. నాచేత సాక్ష్యం పుచ్చుకుని తన తరఫున మరి కొందరి సాక్షులచేత నేను చెప్పినదానికి విరుద్ధంగా చెప్పించి, అబద్ధం సాక్ష్యం ఇచ్చినందుకు నామీద ప్రాసిక్యూషన్ కోసం పిటీషన్ పెట్టాడు. ఒక ప్లీడరు ఇంకొక ప్లీడర్ని ఇలాగ కక్ష సాధించడం చాలా అపూర్వమైన విషయం! మేజస్ట్రీటు చాలా క్లిష్ట పరిస్థితుల్లో పడ్డాడు. కాని, సోమయాజలుగారు గవర్నమెంటు ప్లీడరుగా తనకి వున్న పరువుప్రతిష్టలు ఉపయోగించి మేజస్ట్రీటుని స్వాధీనపరచుకున్నాడు. కేసు ఫైలయింది రాజమహేంద్రవరం జాయింటు మేజస్ట్రీటు దగ్గిర. వెనక లక్ష్మణదాసు కేసులో ఏలూరులో వున్న కెర్షాప్ అప్పటికి రాజమహేంద్రవరం సబ్ కలెక్టరుగా వచ్చాడు.

ఇంక అడిగే దేముంది! అందరూ 'అతనికి నా మీద ఏదో కొంచెం ఆగ్రహం ఉండకపోదనీ, నాకు తప్పకుండా శిక్ష పడుతుందనీ' అనుకున్నారు. నేనే కెర్షాప్ దగ్గిర స్వయంగా హాజరయ్యాను. ఆ కెర్షాప్ దగ్గిర నేను చూసిన ఉత్కృష్టత ఏమి టంటే-ఆయన నన్ను చూసి ముందుగానే "ఏమండీ! ఈ కేసు నేను విచారించడానికి ఏమైనా అభ్యంతరం ఉందా? ఏలూరు సమాచారం వల్ల మీకు నామీద ఏదైనా అనుమానం వుందా?" అని అడిగాడు. నాకు అల్లాంటి సంకోచం ఏమీ లేదని, కేసులో విచారణ న్యాయంగా జరుగుతుందనే నమ్మకం నాకు వుందనీ చెప్పాను. ఆపైన ఆయన కేసు విచారించాడు. సోమయాజులు గారు తను అల్ల గలిగిన కథ అంతా అల్లాడు. కాని కెర్షాప్ చివరికి నేను నిర్దోషి నని తీర్పు ఇచ్చి, ఇల్లాంటి అభూత కల్పనాయుతమైన కేసు ఎన్నడూ జరగలేదనీ, గవర్నమెంటు ప్లీడరు తన పలుకుబడి దుర్వినియోగం చేశాడనీ వ్రాశాడు.