పుట:Naajeevitayatrat021599mbp.pdf/803

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వర్గాలు అనే అనవసరమైన, దేశ నష్టకరమైన విభేదాలు కల్పించారు. విభేద బీజాలు నాటగానే వేరుతన్నే శక్తిగలవై ఉంటాయి. అదే జరిగింది. తర్వాతి అధ్యాయంలో ఈ పరిణామాన్ని గురించి వ్రాస్తాను.

కిసాన్ మజుదూర్ ప్రజాపార్టీ

1947 లో పార్టీ సభ్యులలోనే కొందరు ప్రతికూలురు, క్రమబద్ధంగా ఉండాలనే నిర్భంధం లేకుండా, గాంధీ తత్వానికి కార్యరూపం ఇవ్వడానికి ప్రారంభించిన ప్రకాశంగారిని పదవీచ్యుతిని చేసే పన్నుగడల సమయంలో - న్యాయ అన్యాయ సూక్ష్మతను గ్రహించలేని కాంగ్రెసు అధినేత కృపలానీగారికికూడా, 1951 నాటికి కాంగ్రెసు నుంచి వెలుపలికి పంపబడే అవకాశాలు వచ్చాయి.

1917 లో గాంధీగారు నూతన అహింసామార్గ ప్రతిష్ఠాపకులై, సాత్త్విక నిరోధ ప్రక్రియను బ్రిటిష్ నీలిమందు తోటల పెద్దలపై ప్రయోగించే సమయంలో - సింధు ప్రాంతంలో తాను ఇండియన్ ఎడ్యుకేషనల్ సర్వీసులో వహిస్తున్న ఉన్నతోద్యోగాన్ని వదలి, గాంధీగారి సహచరుడై పనిచేసిన పెద్దమనిషి కృపలానీగారు. ఆయన పన్నెండు ఏండ్లు కాంగ్రెస్ ముఖ్య కార్యదర్శిగా ఉండి, తరువాత కాంగ్రెసు అధ్యక్షులుగా ఎన్నికైన ప్రముఖుడు.

అటువంటి ఆయన స్వాతంత్ర్యం వచ్చిన నాలుగేండ్లకు కాంగ్రెసునుంచి విరమించుకోవలసి వచ్చింది. అలాగుననే, 1946 జనరల్ ఎన్నికల తరువాత బెంగాలుకు ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ పి.సి. ఘోష్‌కూడా కాంగ్రెసుకు రాజీనామా చేయవలసి వచ్చింది. లండనులో డాక్టర్ ఆఫ్ సైన్సు బిరుదు పొంది, కలకత్తా యూనివర్శిటిలో ప్రొఫెసరుగా ఉండి గాంధీగారి పిలుపు అందుకొని దేశంకోసం సర్వమూ త్యాగంచేసిన మహావ్యక్తి ఆయన.

1951 జూనులో, కృపలానీగారు - తనతోబాటూ, తనవలెనే కాంగ్రెసునుంచి విడిపోయిన వారినందరినీ పాట్నాలో సమావేశపరిచారు. వారందరూ కలిసి ఒక పార్టీగా రూపొందాలని నిర్ణయమైంది.