పుట:Naajeevitayatrat021599mbp.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను పెద్ద కేసుల్లో మాగంటి లక్ష్మణదాసు కేసు ఒకటి. దానికి అర్థణా కేసని పేరు. లక్ష్మణదాసు ఏలూరుదగ్గర చాటపర్రు గ్రామస్థుడు. కమ్మ. మంచి పలుకుబడి గలవాడు. అతను ఒకసారి టోలుగేటు ఫీజు అర్థణా ఇవ్వకుండా పోయి, కంట్రాక్టరుమీద జబర్ దస్తీ చేశాడని కేసు, ముందు బెంచికోర్టులో కేసుపెట్టారు. కాని, ఎప్పుడైతే అతను పట్టుదలకొద్దీ వాదించదలుచుకన్నాడో అప్పుడు పోలీసులు దాన్ని పెద్ద కేసుగా మార్చి ఏలూర్ సబ్ కలెక్టరుదగ్గిర పెట్టారు. అప్పుడు సబ్ కలెక్టరు కెర్షాప్ అనే పార్సీ ఐ.సి.యస్. ఉద్యోగి; అతను మొదటి నించీ ముద్దాయికి వ్యతిరేకమైన రిమార్కులు పాసుచేస్తూ ఉండడం వల్ల, అతను కేసు విచారణ చేయకూడదనీ, ఇంకొక మేజిస్ట్రీటు దగ్గిరికి కేసు మార్చవలసిందనీ హైకోర్టుకి పిటీషన్లు పెట్టాం. అతను ఆ పిటీషన్ లు లక్ష్యం చేయకుండానే కేసు విచారించి, 500 రూపాయలు జరిమానా విధించేటట్లు కనబడ్డాడు. అతని ధోరణి చూస్తే శిక్ష కూడా విధించేటట్లు కనబడ్డారు. నేను అడుగడుగుకీ అడ్డు పిటీషన్లు తగిలించి అతన్ని మరీ విసిగించాను. అందుచేత రాజమహేంద్రవరం జిల్లాకోర్టులో అప్పీలు వచ్చింది. ఎవరో సీనియర్ ప్లీడర్ ని ఏర్పాటుచేసి కేసు నడిపించారు. కాని, కిందుకోర్టు తీర్పే ఖాయపడింది. ఆపైన హైకోర్టుకి అప్పీలు చేయించి, అప్పీలు విషయంలో స్వయంగా కృషిచేసి, కేసు గెలిపించాను. దాంతో నా పేరు అటువైపుని బాగా పాకింది. ప్లీడరీలో మొదటి నుంచీ కూడా స్వతంత్రత చూపిస్తూ, సీనియర్లు అనేవాళ్ళనాట్టే లక్ష్యపెట్టకుండా, తొందరగా ప్రాక్టీసు సంపాదించడం వల్ల, తోటి ప్లీడర్ల అసహనానికి పాత్రుణ్ణయ్యాను. తత్ఫలితంగా కొందరు ప్లీడర్లు నామీద కక్ష కట్టారు కూడాను. దానికి ఏమీ కారణం లేదని నా నమ్మకము. అందులో ముఖ్యులు నేతి సోమయాజులు, ములుకుట్ల అచ్యుతరామయ్యగార్లు, నేతి సోమయాజులుగారు గవర్నమెంటు ప్లీడరు కూడాను. ఆయన నామీద కక్ష సాధించడానికి ఏ పని చెయ్యడానికీ కూడా సందేహించలేదు.

ఇల్లాగ ప్రాక్టీసు బాగా సాగుతూండగా నేను ఆనాడు రాజ