పుట:Naajeevitayatrat021599mbp.pdf/798

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గట్టి యత్నం చేశారు. రాష్ట్ర కాంగ్రెసు కమిటీ సభ్యులను మెల్లిగా లోబరచుకొని, రానున్న సాంవత్సరికపు ఎన్నికలలో రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్ష పదవి పొందగలిగి నట్టయితే - ప్రకాశంగారిని మంత్రివర్గం లోంచి పంపించినట్టుగానే కాంగ్రెసునుంచీ పంపివేయడమో, నిర్వీర్యులను చేయడమో ఏదో ఒకటి చేయవలెనని గట్టి పట్టు పట్టారు.

మంత్రులలో కళా వెంకటరావుగారు చాణక్యుని వంటివారు. తాము అధికారంలో ఉన్నారు గనుక, రాష్ట్ర సంఘ సభ్యులను ఏ విధంగా వశపరచుకోవడమో వారు కనిపెట్టారు.

ఆంధ్ర మంత్రుల చేతులలో - రెవిన్యూ, ఆర్థిక శాఖ, స్థానిక సంస్థలు, హరిజన సంక్షేమ శాఖ, మద్యనిషేధం, రెంట్ కంట్రోలు, సినిమా మొదలైన శాఖ లుండేవి. 1951 ఏప్రిలులో రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుని ఎన్నిక జరగవలసి ఉన్నది. ఆ ఏడు బడ్జెటు చర్యల సమయంలో, రాష్ట్ర సంఘ సభ్యులను వశపరచుకొనేందుకు అనేక వాగ్దానాలు చేయబడినాయి. ఆర్డర్లు జారీ చేయబడ్డాయి.

ఎన్నికల రంగస్థలము - విజయవాడ కాంగ్రెసు భవనము

ఆనాడు, ప్రభుత్వంవారు రాష్ట్ర సంఘాన్ని తమ వశం చేసుకోకుంటే, వారి వర్గం తిరిగీ తల యెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడుతాయి. అందుచేత, తమ వర్గానికి వోటు బలము చేకూర్చుకోడానికి రాష్ట్ర సంఘ సభ్యులను, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో, ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఒకరి దివ్య భవనంలో షడ్రసోపేతమైన అన్నపానాదులతో, ఒక చోట చేర్చి పెట్టుకొన్నారు.

మరునాడు ఎన్నిక జరుగుతుందనగా, ఎన్ని లెక్కలు వేసుకొన్నా వారి వర్గం వారికి ఏడు వోట్లు తక్కువగా ఉన్నట్టు తెలిసింది. వారి అభ్యర్థి నీలం సంజీవరెడ్డిగారు. ఆయన మంత్రి పదవి వదులుకొని రాష్ట్ర సంఘ అధ్యక్షుడు కావాలని ఏర్పాటు జరిగింది. ప్రకాశం, రంగా గారల వర్గాల పక్షాన నిలబడ్డ వారు ఆచార్య రంగా గారు.

ప్రభుత్వం పక్షం వారు ఏం చేశారో తెలియదు గానీ, అంత వరకు ప్రకాశం గారంటే ప్రాణాలివ్వడానికైనా సిద్ధమని చెప్పిన నలు