పుట:Naajeevitayatrat021599mbp.pdf/796

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సక్రమంగా పని చేస్తున్నాయని, ప్రజాభిప్రాయం వాటికి అనుకూలంగా ఉన్నదని నేను గట్టిగా ఈ సభముందు చెప్పగలను."

ప్రజల ఉపయోగంకోసం నిష్కల్మషంగా కార్యక్రమం జరిగించినప్పుడు, సత్పలితం కలిగినప్పుడు, కాదని శత్రుపక్షంవారు కూడా అనలేక పోయారు. కాని, సాధారణంగా నడుస్తున్న సహకార సంఘాల వల్ల, మధ్యవర్తి తత్వంగల వారికి లాభమువచ్చే ఉద్యమానికి, ప్రకాశంగారి ఉద్యమం వ్యతిరేక మయినది. అందుచేత, ఆయన దిగిపోయిన వెంటనే, క్రొత్త ప్రభుత్వంవారు ఈ సహకార సంఘాల [ఉత్పత్తి, కొనుగోలుదారుల సహకార సంఘాల] భవిష్యత్తును నిర్ణయించడానికి ఒక ఉప సంఘం ఏర్పాటు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి అయిన రామస్వామిరెడ్డిగారికి - ఈ సంఘాల ఆదర్శాల మీద, కార్యక్రమాల మీద అభిమాన ముండేది.

అయితే, ఆయన వేసిన ఉప సంఘానికి అధ్యక్షుడు - లిమిటెడ్ కంపెనీల మేనేజింగ్ డైరెక్టరు లాగున సహకార సంఘాలను నడిపిస్తూ, సహకారోద్యమానికి నిపుణుని (ఎక్స్‌పర్ట్) క్రింద భావింపబడే రామలింగం చెట్టిగారు. ఆయనకు ప్రకాశంగారి సహకార సంఘాలపైన సహజంగానే వ్యతిరేకత ఉండేది. అందుచేత, ఒక విధమైన రాజీ మార్గంగా సంప్రదాయ సహకార సంఘాలు లేనిచోట ఇవి ఏర్పాటు కావచ్చును అని - నీటికి నీరు, పాలుకు పాలు కలిసిన ఒక సూత్రం ప్రతిపాదించారు. దాంతో, ప్రజా ఉద్యమంతో సంబంధించిన ప్రకాశంగారి సహకార సంఘాలు కొనసాగే సౌకర్యాలు లేక, రాను రాను క్షీణించినవి.

ఆంధ్ర కాంగ్రెస్ రాజకీయాలు

1950 జనవరి 26 న ఇప్పుడు అమలులో ఉన్న సంవిధానం అమలులోకి వచ్చింది. అయితే, దాని ప్రకారం ఎన్నికలు జరగడానికి 1946 నుంచి లెక్క వేస్తే, 1952 తేలింది. అందుచేత, 1951 లో నుంచి కూడా అన్ని రాష్ట్రాల ప్రజల దృష్టి ఆ రాబోయే ఎన్నికలపైన పడింది. అప్పటికి ఆంధ్ర కాంగ్రెసు రెండు వర్గాలుగా విడిపోయింది.