పుట:Naajeevitayatrat021599mbp.pdf/791

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పట్టాభిగారు, ప్రకాశంగారి గదిలోకి వెళ్ళడమనేది ఒక విశేష కార్యం క్రింద భావించి, పది పదిహేనుగురు సభ్యులు నా గది దగ్గరగా ఉన్న కారు చుట్టూ మూగారు.

మేము, - ప్రకాశంగారు, పట్టాభిగారు కలుసుకున్నప్పుడు ఎలా మాట్లాడుతారో ఊహాగానం చేయ నారంభించేంతలోనే పట్టాభిగారు ఒక చేత్తో జారిపోతున్న పంచె గోచీ సర్దుకుంటూ, రెండవ చేత్తో క్రిందికి మీదికి జారిపోతున్న కాగితాలను పట్టుకుంటూ కారు దగ్గరికి ఇలా కేక లేసుకుంటూ వచ్చారు:

"ఆ ముసలి మూర్ఖునితో ఎవరు వేగగలరు? చ....ఛ...విశ్వనాథం! నువ్వు సంతకం పెట్టనన్నావు! మీ పార్టీ మీటింగుకి నేను రానూ అక్కరలేదు, ఈ ఒడంబడిక కాగితం మీరు అంగీకరించనూ అక్కరలేదు. పోండి! మీకు చేతనైనది ఏదో చేసుకోండి!"

కఠోరమైన కంఠంతో ఈ మాటలు చెప్పి, అతి విసురుగా చేతులు ఊపి, కారులో తొందరగా ఎక్కి కూచుని, డ్రైవరుతో "తిప్పు కారు మన యింటికి," అని ఆదేశించి ఆగ్రహంగా వెళ్ళిపోయారు.

ఈ చెన్నపట్నం సమస్యే, తొలినుంచి చివరివరకు మ్రగ్గిపోయి, చివరికి అమరజీవి పొట్టి శ్రీరాముల ప్రాణాన్ని కూడా హరించింది.

షెడ్యూలులో ఆంధ్రరాష్ట్రం పేరు కలుపుతామని చెప్పిన ఆ సమయంలో, అధిష్ఠాన వర్గాన్ని, ఆంధ్రుల చిరకాల వాంఛను ఈడేరిస్తూ ఉన్నందుకు నెహ్రూగారినీ - కాన్ట్సిట్యుయెంట్ అసెంబ్లీ (సంవిధాన సభ)లో ప్రకాశంగారు పొగిడారు. ఆ సందర్భంగా, తమకు చేదోడు వాదోడుగా ఉన్న ఆచార్య రంగా, డాక్టర్ పట్టాభి, అనంతశయనం అయ్యంగారు, శ్రీమతి దుర్గాబాయి మొదలగువారు చేసిన కృషినికూడా ఆయన ప్రశంసించారు.

ఇంతేకాక, ప్రకాశంగారు మరొకటి చెప్పారు:

"భాషాప్రయుక్తరాష్ట్రాలు ఏర్పడితే, భారతదేశం - బాల్కనైజు (Balkanise)[1] అయిపోతుందని కొందరు

  1. యూరపు ఖండపు ఆగ్నేయభాగంలో అనేక విధాలరాజీపడి, ఆ భాగమంతా ప్రతినిత్యమూ పోరాడే, నిస్సత్తువగల చిన్న చిన్న దేశాలుగా మారినదానిని సూచిస్తుంది ఈ 'బాల్కనైజు' అన్న పదము.