పుట:Naajeevitayatrat021599mbp.pdf/790

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంతకం, కామరాజ నాడార్‌గారి సంతకం ఉన్నాయి. వారు సంతకం పెట్టిన భాగం పైన ఉన్న మాట లివి:

"చెన్నపట్నంమీద ఆంధ్రులు హక్కులు వదులుకో గలందుకును, తిరుపతిపై తమిళులు హక్కులు వదులుకో గలందుకును ఇందు మూలముగా అంగీకరించడమైనది."

ఇటువంటి కాగితంపైన - ఆయన, బుజ్జగింపు మాటల మధ్య నన్ను సంతకం చేయమని రెండు, మూడు పర్యాయాలు చెప్పగా, "మీరీ విషయం ప్రకాశంగారితో చర్చించగూడదా?" అని ప్రశ్నించాను.

దానిపైన ఆయన, "ప్రకాశంగారితో ఎవరికి కుదురుతుంది? మా మటుకు మాకు ఆయన సంతకం కన్నా నీ సంతకమే ఎక్కువ విలువ గలది," అన్నారు.

కాని, నేను ఆయనను తిరిగి మెల్లిగా నచ్చజెప్పి, "సాయంత్రం మీరు ఒకమారు స్వయంగా ప్రకాశంగారిని కలుసుకొంటే మనమంతా ఒక పద్దతికి రాగలము గదా!" అన్నాను.

అందుకు, "సరే, ఎందుకు చెప్పావో! ఈ సాయంత్రం జరగబోయే మీ కాంగ్రెస్ శాసన సభ్యుల సమావేశంలో ఇందులో వ్రాసింది ఆమోదించడానికి, ఎజండాలో ఈ విషయం కలుపబడుతుంది. కాబట్టి, అక్కడే ప్రకాశంగారు ఉన్నారు గనుక, ఒక అరగంట ముందుగా వచ్చి ఆయనతో మాట్లాడుతానులే," అని ఆయన చెప్పారు.

ఏలాగో, ఆయన చెప్పినట్టు సంతకం చేయకుండా, ఆయన మనసుకు నొప్పి కలిగించకుండా, పరస్పర సుహృద్భావంతో బయట పడ్డాను.

అనుకున్నట్టు, పట్టాభిగారు ఆ సాయంకాలం వచ్చి, నా గది దగ్గిర కారు నిలిపారు. దిగివచ్చి, "ఏం విశ్వనాథం! నువ్వు చెప్పినట్టు వచ్చాను. ప్రకాశంగారు ఇక్కడ ఎక్కడున్నారు?" అని అడిగారు. ప్రకాశంగారు బసచేసిన మేడగదులు చేత్తో చూపించాను. అది గవర్నర్ భవనంకాక ప్రత్యేకంగా వేరే కట్టిఉన్న ఒక చిన్న మేడ భాగము.