పుట:Naajeevitayatrat021599mbp.pdf/789

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తేల్చారు. అందుచేతనే, వర్కింగ్ కమిటీవారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రాంతానికి చేసిన ఈ విధమైన ఏర్పాటు భాషారాష్ట్రాలు కోరుతున్న ఇతర ప్రాంతాలకూడా చేయడం న్యాయము. భాషారాష్ట్రాలు ఐకమత్యమును తీసుకువస్తాయి గాని, అనైక్యమును తీసుకురావు. భాషారాష్ట్రాలు ప్రజలకు బలం చేకూర్చి, ప్రజావ్యతిరేక శక్తులను ఎదిరించే శక్తి వారికి కలగజేస్తాయి."

ఇందులో ఇచ్చిన సలహాలనుబట్టి చెన్నరాష్ట్ర ప్రభుత్వం వా రొక రాష్ట్రవిభజన సంఘాన్ని (పార్టిషన్ కమిటీ) ఏర్పరచారు. ఆ సంఘంలో ప్రకాశంగారు తప్ప, తక్కిన ఆంధ్ర సభ్యు లిద్దరూ తమిళ సభ్యులు చెప్పిన సూచనలన్నిటికీ అంగీకారం ప్రకటించారు. అందులో ముఖ్యమైనది - చెన్నపట్నంమీద ఆంధ్రులు అధికారం వదలుకోవలెనన్న సూత్రము. ప్రకాశంగారు అది ఎంత మాత్రం అంగీకరించము అని అడ్డారు. అ కమిటీవారు చేసిన మిగిలిన కార్యక్రమమంతా - అనగా, అప్పులు, రాబడి పంపకములు, ఈ ప్రశ్నముందు స్వల్పంగా కనిపించాయి.

ప్రకాశం - పట్టాభి

ఈ విషయమై మరొక ఉదంతం కూడా చెప్పాలి. వ్యక్తిగతంగా ఎన్ని బేదాలున్నా, డాక్టర్ పట్టాభిగారు కాంగ్రెసు అధ్యక్ష పదవికి పోటీచేసిన సందర్భంలో ప్రకాశంగారు తమ అనుయాయు లందరితోను కలసి, ఆయనను తమ వోట్లతో నెగ్గించవలెనని యత్నించి, ఆ కార్యం సాధించారు. పట్టాభిగారు అధ్యక్షులయిన తర్వాత, (ఆ రోజులలో అధ్యక్షుణ్ణి రాష్ట్రపతి అని పిలిచేవారు) ఆయన చెన్నపట్నం వచ్చినప్పుడు, నేను వారి బసకు గౌరవ సందర్శనం చేయడానికి వెళ్లాను. రెండు మూడు మాటలు కుశల ప్రశ్నలు సాగిన తర్వాత, ఆయన చటుక్కున లేచి, లోపలికి వెళ్ళి, ఒక అర ఠావు సైజు కాగితంతెచ్చి, దానిమీద సంతకం చేయమన్నారు. దానిమీద అప్పటికే ఆయన