పుట:Naajeevitayatrat021599mbp.pdf/786

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"ఏమయినా సరే, ఇవ్వ" నన్నారు శంకరరావుదేవుగారు.

అంటే, ఈ ఫిర్యాదు రాజకీయంగా వేసిన ఎదురెత్తేగాని, నిజం కాదన్నది ఆయనా గ్రహించే ఉంటాడు. అందుచేతనే - అసలు ఇవ్వ వలసిందని మా పట్టుదల; ఇవ్వనని ఆయన పట్టుదలాను.

అధిష్ఠాన వర్గంలో ప్రకాశంగారికి ప్రతికక్షిగా ఉన్న ఒక ఉన్నత స్థానీయుని యింట యీ అభూత కల్పన జరిగిందని మా అందరి మనసులలోనూ ఉండేది.

ఇక, ఇక్కడ చెన్నపట్నంలో తమకు లంచమిచ్చాడని చెప్పబడ్డ వ్యక్తిని పిలిపించి, ఆయన చెప్పే సాక్ష్యం తీసుకోవలసిందని ప్రకాశంగారు శంకరరావుదేవుగారిని బలవంతం చేశారు.

"ఎందుకు లేండి, అక్కరలేదు లేండి" అని ఆయన తప్పుకొన్నారు.

ఆ తర్వాత, శంకరరావుదేవుగారు - ముఖ్యమంత్రి కుమారస్వామిరాజాగారిచేత ఆరోపణపత్రంలో చెప్పిన బ్యాంకుకు ఉత్తరం వ్రాయించారు అ భ్యాంకువారు, ఆ పేర్కొన్న వ్యక్తికి తమ బ్యాంకులో అకౌంటు లేదనీ, అందులో చెప్పిన నంబరుగల చెక్కు పుస్తకం తమ బ్యాంకువారు జారీ చేయలేదనీ వ్రాశారు. ఇంక ప్రకాశంగారిపైన దోష మేముంది?

అయితే, కుమారస్వామిరాజాగారు గానీ, శంకరరావుదేవుగారు గానీ - బ్యాంకువారి ఉత్తరాన్ని వెంటనే బయటపెట్టలేదు.

కొంతకాలమైన తర్వాత మేము ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది. ఈ తగువు తీర్చడానికి, కాంగ్రెసు అధిష్ఠాన వర్గంవారు - వల్లభాయి పటేలు, జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అజాద్‌గారలు గల ఒక ఉప సంఘాన్ని నియమించారు.

బ్యాంకువారి ఉత్తరం సంగతి మాకు తెలియనీకపోవడంవల్ల, ప్రకాశంగారు మొదటి ధోరణిలోనే, తమపై గల ఆరోపణ మొట్టమొదట విచారించి, తాము దోషియో, నిర్దోషియో తేల్చవలసిందని బలవంతపరిచారు.