పుట:Naajeevitayatrat021599mbp.pdf/783

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సెక్రటరీగారికి చూపించి, ఆయన బాగున్నదన్న తర్వాతే కార్యనిబంధనల ప్రకారంగా నోటీసిచ్చాము.

ఈ నోటీసిచ్చామన్న సంగతి తెలిసిన వెంటనే మంత్రివర్గం యావత్తూ ఆ బరువు స్పీకరుపైని మోపడం మొదలుపెట్టారు.

యథాలాపంగా మాట్లాడినట్లు ఒకమారు, సలహా అడిగినట్లు మరొకమారు; రాజేంద్ర ప్రసాద్‌గారే ప్రభుత్వం ప్రతిష్ఠకు లోటు వస్తుందని చెప్పినప్పుడు, కాంగ్రెసు పార్టీలో సభ్యులయిన ప్రకాశంగారు ఇటువంటి తీర్మానం ప్రతిపాదించడం న్యాయంగా ఉందా అని ఇష్ఠాగోష్ఠిగా చెప్పినట్లు ఇంకొకమారు; ఇంతకూ ప్రకాశంగారికి సంఖ్యాబలం లేకపోవడంవల్ల ఏలాగూ వీగిపోయే తీర్మానం చర్చకు తెచ్చి, శాసన సభా సమయమంతా వ్యర్థపరచడం భావ్యమా అని వేరొక్కమారు - అనేక విధాలుగా స్పీకరుగారిని ఒక మంత్రి వదలితే ఇంకొక మంత్రి, వారి వర్గాలకు చెందిన శాసన సభ్యులూ వెళ్ళి ఆయనను నొక్కాడానికి చాలా యత్నించారు.

ఆయన కూడా కార్యదర్శితో చాలా చర్చించి, ఆ తీర్మానం త్రోసివేయడానికి ఏ విధంగానూ వీలులేక పోవడంవల్ల దానిని గ్రహిస్తూ, ఎట్లయినా తీర్మానం వీగిపోతుంది గదా - బాధ ఎందుకని మంత్రులకు నచ్చజెప్పి, ఆ తీర్మానాన్ని ఎజండాలోనికి తెచ్చేందుకు అనుమతించారు.

ప్రకాశంగారి ఉద్దేశం - తీర్మానం జయమవుతుందా, వీగి పోతుందా అన్నది కాదు. శాసన సభలో బాహాటంగా, ముఖాముఖి చర్చ జరిగితే, మంత్రులు చెప్పుకోగలిగినదంతా చెప్పుకున్న తర్వాత - మంత్రులుచేసిన పనులు, అధికార దుర్వినియోగం క్రింద తప్పకుండా వస్తాయని ప్రజలు గ్రహిస్తారనీ, అలా గ్రహించడంవల్ల రాబోయే ఎన్నికల్లో వారే అధికార దుర్వినియోగం చేసిన ఆ మంత్రులకు తగిన గుణపాఠం చెప్పుతారనీ ఆయన ఆలోచన. అది పొరపాటు కాలేదు.

శాసన సభలోనూ, తర్వాత బహిరంగంగానూ ఆ మంత్రులు మొదటి సంవత్సరంలోనే చేసిన అధికార దుర్వినియోగాన్ని ప్రజలు