పుట:Naajeevitayatrat021599mbp.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దలకొద్దీ, వెంటనే ఆకేసు హైకోర్టుకి తీసుకువెళ్ళి, ఆడమ్సు అనే ఆయన్ని ప్లీడరుగా పెట్టి, కేసు నడిపించాను. అక్కడ వున్న లా పుస్తకాలన్నీ తిరగవేసి రిపోర్టు కాని కేసుల్లోనించి ఒక తీర్పు పట్టుకున్నాను. చోరీ ఆస్తిని గురించి ఆచోకీ ఇచ్చినంతమాత్రం చేత నేరం రుజువు కాదని తీర్పు దొరికింది. ఆ తీర్పు చూపించడంతోటే సర్ డేవిస్, సుబ్రహ్మణ్య అయ్యరుగార్లు శిక్ష కొట్టివేసి, ముద్దాయీలను విడుదల చేశారు. దాంతో మరింత గణనలో పడ్డాను.

మునసబు కోర్టులో లా ఫైలు ఆకర్షించాను. అప్పుడు రంగమన్నారు అనే ఆయన మునసబు. ఆయన కోర్టులో గుమాస్తాగా వుండి క్రమంగా పైకివచ్చినవాడు. మంచి తెలివైనవాడు. జడ్జిమెంటు మంచి పకడ్ బందీగా వ్రాసేవాడు. అయితే ఆయనకి లంచగొండి అనీ, పక్షపాతి అనీ కొంత అపఖ్యాతి వుండేది. అప్పట్లో ఆయనకి ఏలూరి వెంకట్రామయ్యగారు అంటే అభిమానం. ఎందుచేతనో రంగమన్నారు నాయెడల కొంచెం సద్భావం చూపించేవాడు. నే నెన్నడూ ఆయన్ని ఆశ్రయించలేదు. కాని, ఎందుచేతనో ఆయన నాకు చాలా సహాయం చేస్తూ వుండేవాడు. అందుచేత కూడా ఫైలు పెరిగింది. ఈ ప్రభ కొంతకాలం నడిచాక ఈ రంగమన్నారుకీ నాకూ తగాదా వచ్చింది.

సుబ్బారావుపంతులు ప్రభృతులు, ఆయన లంచగొండి అనీ, కొందరు ప్లీడర్లంటే ప్రత్యేకాభిమానం చూపిస్తాడనీ, తద్వారా న్యాయ వ్యవహారాలకి నష్టం వస్తోం దనీ, హైకోర్టుకి పిటీషన్ పెట్టారు. అందులో నన్ను కూడా సంతకం చెయ్య మన్నారు. అల్లాంటి కింవదంతులు, గోల వుండేవి. కనక నేను కూడా దస్కతు పెట్టాను. దాంతో ఆయనకీ, నాకూ చెడిపోయింది. ఇంతమంది ప్లీడర్ల పిటీషన్ మీద హైకోర్టువారు అది విచారణకి పంపారు. రంగమన్నారు ఘాటైన సమాధానం వ్రాశాడు. అసలు వ్యవహార మెట్లా ఉన్నా సమాధానం మంచి చాకచక్యంగా వ్రాశాడు.

దాంతో అతను నిర్దోషిగా నిర్ణయించబడ్డాడు. హైకోర్టువారి నిర్ణయం చేత ఆయన మరీ తాడుబారిపోయాడు. ఆయనకి ఆశ్రితపక్ష