పుట:Naajeevitayatrat021599mbp.pdf/777

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో గట్టిగా ఎదిరించాను. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, సంవిధానంలో రాష్ట్ర ప్రభుత్వాలకని ఏర్పాటైన విషయాలలో, మన ప్రభుత్వానికి చెందినంతమటుకు, సంవిధానానికి వ్యతిరేకంకాని పద్ధతిలో, మనకు తోచిన నిర్ణయం మనమే చేసుకోవచ్చును. మన సంవిధానానికి విధేయత చూపుతూ ప్రమాణం చేయమనడానికిదే కారణము."

ప్రకాశంగారు ఈ మాటలు చెప్పిన తేదీ 3-12-47. అప్పటికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు నాలుగు నెల లయింది.

అయినప్పటికీ, బ్రిటిషు ప్రభుత్వం ఎడల విధేయత చూపుతూ ప్రమాణంచేసిన వారు, డిల్లి ప్రభుత్వానికి విధేయత చూపించాలని భావించారు కానీ, సంవిధానం విషయం వారి మనసుకు పట్టలేదు.

ఇతర విశేషములు: 1947

ప్రకాశంగారి మంత్రిమండలి పతానానంతరము, ఆయన నివసిస్తున్న ఇంటినుంచి ఉత్తర క్షణం ఖాళీ చేయించడానికి చిన్న ఉద్యోగులు, సిబ్బందీ పూనుకొన్నారు. జ్ఞాతి వైరమంటే అలా ఉంటుంది. ప్రకాశంగారు మరొక ఏర్పాటు చేస్తేగానీ అక్కడినుంచి కదిలేది లేదన్నారు. కార్యదర్శులు కొందరు, ఈ సమస్య నెలా పరిష్కరించేదని గాభరా పడ్డారు.

గవర్నమెంట్ హవుస్ ఎస్టేటులో ఒకటి, రెండు ఇండ్లు ఖాళీగా ఉన్నాయి. మంత్రులైనా, కాకున్నా - ముఖ్యులైన శాసన సభ్యులకు అవి వసతి గృహాల క్రింద ఇవ్వడం పరిపాటి.

రెండు, మూడు దినాలు సిద్ధాంత రాద్ధాంతాలు జరిగిన తర్వాత, ఒక యిల్లు కేటాయించగా, ప్రకాశంగారు పాత యింటిని వదిలి, అందులోకి వెళ్ళారు.

ఆంధ్రరాష్ట్రం ఏర్పాటై, కర్నూలుకు కదిలేదాకా ఆయన ఆ యింట్లోనే నివసించారు.

నూతన ఆంధ్రరాష్ట్ర స్వరూపం ఆ యింట్లోనే నిర్ణయమైనది.