పుట:Naajeevitayatrat021599mbp.pdf/772

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకాశం - సాంబమూర్తిగారల మధ్య విభేదము, ఫలితము

మన దురదృష్టం కొద్దీ, రాజాజీ పాకిస్తాన్ ఇచ్చివేయవలసిందని ఉపన్యసించిన ఒక సభకు బులుసు సాంబమూర్తిగారు అధ్యక్షత వహించారు, వెనక ఒకమారు. తర్వాతి ఆంధ్ర రాజకీయాలలో, వీరిద్దరు కలిసి చేసిన ప్రచారపు దుష్ఫలితాలను గూర్చి తర్వాత వ్రాస్తాను. ఇక్కడ ఒకటి మాత్రం వ్రాయాలి. పై సంఘటనతో ప్రకాశంగారికి సాంబమూర్తిగారికి మధ్య ఒక అగాధం ఏర్పడింది. ప్రకాశంగారు తలచుకుని ఉన్నట్టయితే, స్థానికంగా ఉన్న ఉపనాయక వర్గం తనకు ఎదురు తిరిగి, తాను రాజాజీతోబాటు జరిపిన ప్రయాణ కార్యక్రమాన్ని అంత గట్టిగా నిరసించి ఉండరనీ, ప్రకాశంగారు రాజాజీపై ఉన్న కోపంతో పాత చరిత్రను గమనించకుండా తనకు కూడా ఇటువంటి దుస్థితి కలిగించారనీ - సాంబమూర్తిగారు తర్వాత ఎప్పుడూ అంటూండేవారు. ఈ విషయంలో ప్రకాశంగారి చర్య తార్కిక వాదానికి సరిగా ఉన్నప్పటికీ, అంతదాకా తమకు అండ దండలుగా ఉండి, ఎప్పుడూ బలపరుస్తూన్న సాంబమూర్తిగారు ఆ తర్వాత సహాయం చేసే పరిస్థితులు లేకుండా చేసినది. సాంబమూర్తిగారి సహాయమే ఉన్నట్లయితే, 1946, 47 లలో ప్రకాశంగారు అంత తొందరగా శత్రువుల చేత పడేవారు కారు.

15

ప్రకాశంగారి గుండెదిటవు

లోగడ ప్రకాశంగారి మంత్రివర్గ పతనకారకులైన తెలుగు మంత్రులపైన ఆంధ్రదేశ ప్రజలకు చాలా ఆగ్రహం కలిగిందని వ్రాశాను.

ఇలా ఉండగా, 13-4-47 న, జలియన్‌వాలాబాగ్ దినమున [1]

  1. 1919 లో వ్యక్తి స్వాతంత్ర్యాన్ని అనేక విధాలుగా అణచివేయడానికని రౌలట్ బిల్సు అని రెండు బిల్లులను కేంద్ర సభలో ప్రభుత్వంవారు ప్రవేశపెట్టగా, దేశమంతటా ఆందోళన కలిగింది. ఆ బిల్లులు పాస్ చేస్తే, దేశంలో సాత్త్విక నిరోధం (Passive resistance) ప్రారంభిస్తామని గాంధీజీ ప్రకటించారు. దేశమంతటా ప్రచారం జరిగింది. అపుడు అమృతసరులో జలియన్ వాలాబాగ్ అనే బహిరంగ స్థలంలో ఒక సమావేశం ఏప్రిల్ 13 న జరిగింది. ఆ ఆవరణకు ఒకటే త్రోవ. ఇటువంటి సభలు జరగడం ప్రభుత్వానికి ఇష్టంలేదు. అందుచేత జనరల్ డయ్యర్ అనే ఆయన అక్కడికి మెషీన్‌గన్ తెచ్చి, ఎవరినీ బయటికి పోనీక అడ్డుపడి, 1500 మందిని దారుణంగా హత్యచేశాడు. 3, 4 వేల మంది గాయపడ్డారు. అప్పటినుంచి బ్రిటిషువారు జరిపిన ఆ అమానుష కృత్యానికి గుర్తుగా ఆ 13 వ తేదీన - జలియన్ వాలాబాగ్ దినం జరపడం, సభలు చేయడం మన దేశంలో ఆచారంగా ఉన్నది.